Share News

MSME parks on Jindal lands జిందాల్‌ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు

ABN , Publish Date - May 31 , 2026 | 12:06 AM

MSME parks on Jindal lands జిందాల్‌ భూముల్లో ఎంఎస్‌ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) పార్కుల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జూన్‌ మూడోవారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసేందుకు రానున్నారు.

MSME parks on Jindal lands జిందాల్‌ భూముల్లో   ఎంఎస్‌ఎంఈ పార్కులు
ఎస్‌.కోట మండలం కిల్తంపాలెంలోని జిందాల్‌ ఇండస్ట్రీయల్‌ పార్కు కార్యాలయ ఆవరణంలో నిర్మించిన హెలిపాడ్‌

జిందాల్‌ భూముల్లో

ఎంఎస్‌ఎంఈ పార్కులు

శంకుస్థాపన ఏర్పాట్లలో ప్రభుత్వం

త్వరతగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌కు పరిశ్రమల కార్యదర్శి ఆదేశం

జూన్‌ మూడో వారంలో సీఎం చంద్రబాబుతో భూమిపూజ

నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై ఇప్పటికే జరిగిన చర్చలు

‘శృంగవరపుకోట మండలంలో నిర్మించనున్న జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్‌ పార్కు (మల్టీ యుటీలిటీ ఎంఎస్‌ఎంఈ పార్కు) శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయండి. త్వరతగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి’ అంటూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సెక్రటరీ ఎన్‌.యువరాజ్‌ శనివారం అమరావతి నుంచి జరిపిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, జేసీ ఎస్‌.సేతుమాధవన్‌కు చెప్పారు. పార్కు ప్రస్తుత ప్రగతి, భూసేకరణ మౌలిక వసతుల కల్పనపై సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ శనివారం జారీ చేసిన ప్రకటనలో ధ్రువీకరించింది.

శృంగవరపుకోట, మే 30 (ఆంధ్రజ్యోతి): జిందాల్‌ భూముల్లో ఎంఎస్‌ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) పార్కుల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జూన్‌ మూడోవారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసేందుకు రానున్నారు. జూన్‌ 15, 16, లేదంటే జూన్‌ 21న ముహూర్తం నిర్ణయించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది. జూన్‌ 21న ఈ భూమి పూజ ఉంటుందని పరిశ్రమల భూసేకరణలో ముఖ్యభూమిక వహించిన యాజమాన్య ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. జిందాల్‌ భూముల్లో ఇండస్టీయల్‌ పార్కుల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వస్తుండడంతో అఽధికారులు ఇందుకు సంబంధించిన ప్రకియను పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. జిందాల్‌ యాజమాన్యానికి, భూ నిర్వాసితులకు మధ్య నడుస్తున్న వివాదాన్ని పరిష్కరించేందుకు వారితో ఈ నెల 20న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత విశాఖలో చర్చలు జరిపారు. భూనిర్వాసితులతో పాటు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జెఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్‌ పార్కు వైస్‌ ప్రెసిడెంట్‌ రాచూరి కనకారావులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఇలా జిందాల్‌ భూసేకరణలో జరిగిన లోపాలను సరిదిద్దే పనిలో ప్రభుత్వం నిమగ్నమవడంతో ఈ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి మార్గం సుగమం అవుతోంది.

నాడు భూ సేకరణ మొదలైంది ఇలా..

శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి, చీడిపాలెం, చినఖండేపల్లి, మూలబొడ్డవర, కిల్తం పాలెం గ్రామాల పరిధిలో 2007-2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం జిందాల్‌ యాజమాన్యం కోసం భూసేకరణ చేసింది. 919.22 ఎకరాల అసైన్డ్‌, డి.పట్టా భూములు, 208.54 ఎకరాల ప్రభుత్వ భూమి కలిపి 1127.76 ఎకరాలను ఆ సంస్థకు రిజిస్ట్రేషన్‌ చేసింది. అల్యూమినియం శుద్ధి కర్మాగారం నిర్మిస్తామని ఈ భూములు తీసుకొంది. ఈ పరిశ్రమకు ముడిసరుకుగా బాక్సెట్‌ అవసరం. అయితే వివిధ కారణాలతో విశాఖ ఏజెన్సీలో బాక్సెట్‌ తవ్వకాలను ప్రభుత్వం నిషేధించింది. ముడిసరుకు వచ్చే అవకాశం లేక పరిశ్రమ నిర్మాణం చేపట్టలేకపోయింది. భూములు తీసుకొని పరిశ్రమను నిర్మించకపోవడంతో భూనిర్వాసితులు భూములను వెనక్కి ఇచ్చేయాలని అడుగుతూ వస్తున్నారు. అయితే ప్రతిపాదిత పరిశ్రమ స్థాపనకు బదులు మెగా ఇండస్ట్రీయల్‌ పార్కులను ఈ భూముల్లో నిర్మించేందుకు జిందాల్‌ యాజమాన్యం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంది. ప్రస్తుతం అధికారంలో వున్న తెలుగు దేశం , జనసేన, బిజేపీ కూటమి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని చూస్తోంది. ప్రతి నియోజకవర్గంలోను ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరంగా భూములను కేటాయిస్తోంది. ఒకే చోట ఎక్కువ మొత్తంలో భూముల లభ్యత లేకపోవడంతో 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలను గ్రామాల్లో గుర్తించాల్సి వస్తోంది. దీనికి కూడా స్థానికుల నుంచి అడ్డంకులు వస్తున్నాయి. వీటిని అధిగమించేందుకు అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో జిందాల్‌ యాజమాన్యం వద్ద సిద్ధంగా వున్న వందలాది ఎకరాల భూముల్లో ఇండస్ట్రీయల్‌ పార్కుల నిర్మాణం వైపు ఆలోచించింది. భూనిర్వాసితుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకుంది. వాటికి పరిష్కార మార్గం చూపేందుకు ఆలోచన చేసింది. హోం మంత్రి జరిపిన చర్చల్లో పురోగతి కనిపించడంతో నిరుద్యోగ యువతకు తొందరగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందకు ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణం చేపట్టేందుకు తోందరపడుతోంది. జిందాల్‌ యాజమాన్యం కూడా ప్రభుత్వం నుంచి ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందానని ఎదురు చూస్తోంది. భూమి పూజకు వచ్చే ముఖ్యులకు రోడ్డు మార్గం నుంచి కాకుండ నేరుగా ఇండస్ట్రీయల్‌ స్థలంలో దిగేలా హెలీప్యాడ్‌లను నిర్మించేశారు. సభాస్థలం చూసేందుకు సీఎం సభాకార్యక్రమాలను ఏర్పాట్లు చేసే సిబ్బంది శుక్రవారం పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం సభాస్థలం చూసి వెళ్లారు. అధికారికంగా ప్రకటన రావడంతో నిరుద్యోగ యువతలోనూ ఆశలు మొలకెత్తాయి.

Updated Date - May 31 , 2026 | 12:06 AM