Share News

MPPs assume officeకొలువుదీరిన ఎంపీపీలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:52 AM

MPPs assume office మండల పరిషత్‌ అధ్యక్షులు(ఎంపీపీ) కొలువుదీరారు. మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను గురువారం ఎన్నికల అధికారులు చేపట్టారు. తొలుత కో-ఆప్షన్‌ ఎన్నికకు సిద్ధం అవుతున్న సమయంలో ఈ ప్రక్రియ వాయిదా వేయాలని ఆదేశాలు రావడంతో నిలిపివేశారు.

MPPs assume officeకొలువుదీరిన ఎంపీపీలు
పూసపాటిరేగ ఎంపీపీగా తమ్మినాయుడ్ని బలపరుస్తున్న కూటమి ఎంపీటీసీలు

కొలువుదీరిన ఎంపీపీలు

వాయిదా పడ్డ కో-ఆప్షన్‌ మెంబరు ఎన్నిక

లాటరీలో గుర్ల ఎంపీపీ పీఠం కూటమికే

వాయిదాపడిన భోగాపురం ఎంపీపీ ఎన్నిక

గరివిడి మండలానికే వైసీపీ పరిమితం

మండల పరిషత్‌ అధ్యక్షులు(ఎంపీపీ) కొలువుదీరారు. మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను గురువారం ఎన్నికల అధికారులు చేపట్టారు. తొలుత కో-ఆప్షన్‌ ఎన్నికకు సిద్ధం అవుతున్న సమయంలో ఈ ప్రక్రియ వాయిదా వేయాలని ఆదేశాలు రావడంతో నిలిపివేశారు. అనంతరం ఎంపీపీ ఎన్నిక జరిగింది. తొలుత మండల ప్రాదేశిక సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికను నిర్వహించారు. పార్టీ విప్‌ జారీ చేసిన అనంతరం ఎన్నికల అధికారులు ఎంపీపీ ఎన్నికను చేతులెత్తే పద్ధతిలో నిర్వహించారు. కాగా లాటరీలో గుర్ల ఎంపీపీ పీఠం కూటమికే దక్కింది. భోగాపురం ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ ఒక్క మండలమైన గరివిడికే పరిమితమైంది.

విజయనగరం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి):

మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికల్లో ఎంపీపీ అభ్యర్థిని ఒక ఎంపీటీసీ ప్రతిపాదించగా, మరొక ఎంపీటీసీ బలపరిచారు. అభ్యర్థి పేరును రిటర్నింగ్‌ అధికారి ప్రకటించాక సభ్యులు ఆమోదం తెలిపిన అనంతరం ఎంపీపీని ప్రకటించారు. చేతులెత్తే విధానంలోనే ఈ ప్రక్రియ జరిగింది. అంతకుముందు కోరం కోసం అధికారులు ఎన్నికల ప్రక్రియకు హాజరయ్యే ఎంపీటీసీల సంతకాలను సేకరించారు. అనంతరం రిటర్నింగ్‌ అధికారి వాటిని పరిశీలించిన తరువాత ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను ముందుకు నడిపారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అధికారులు, ఎంపీటీసీ సభ్యులు మినహా ఎవరినీ కార్యాలయంలోకి అనుమతించలేదు. ఓ వైపు ఎంపీపీ ఎన్నిక జరుగుతుండగా, ఆయా కార్యాలయ ఆవరణాల్లో కార్యకర్తల కోలాహలం, సందడి కన్పించింది. ఎన్నిక ముగిసిన తరువాత కొన్నిచోట్ల ఎంపీపీలు వారి స్థానాల్లో ఆశీనులై, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఇదే సమయంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఎంపీపీలను పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. డెంకాడ మండల ఎంపీపీ పదవిని అక్కివరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కంది ఉమ చేపట్టారు. ఆ మండల టీడీపీ సీనియర్‌ నాయకుడు కంది చంద్రశేఖర్‌ ఈమెను ఎంపీటీసీగా గెలిపించి, ఎంపీపీగా చేశారు. అయితే ఈ మండలంలో ఎంపీపీ పదవి జొన్నాడ ఎంపీటీసీగా గెలుపొందిన పతివాడ కిరణ్‌శ్రీకి దక్కుతుందని అందరూ ఆశించారు. ఇదిలా ఉండగా గరివిడి మండలం ఎంపీపీని మాత్రమే వైసీపీ గెలుచుకుంది.

సినీ ఫక్కీలో రేగ ఎంపీపీ ఎన్నిక

పూసపాటిరేగ, నవంబరు19(ఆంధ్రజ్యోతి): ఎంపీపీ ఎంపిక సినీ ఫక్కీలో జరిగింది. ఎంపీపీ బీఫాం జనసేనకు వచ్చింది. ఈ మేరకు చింతపల్లి-1 అభ్యర్ధికి అందజేసినా ఏ ఒక్కరూ ఆమెను ప్రతిపాదించకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. తర్వాత పతివాడ తమ్మినాయుడిని పలువురు బలపరచగా జనసేనకు సంబంధించి బీఫాం పొందిన అభ్యర్థి కూడా ఎంపీపీగా తమ్మినాయుడిని బలపరుస్తూ చేతులు ఎత్తడం విశేషం. దీంతో 12మంది మద్దత్తు లభించడంతో తెలుగుదేశంపార్టీకి చెందిన పతివాడ తమ్మినాయుడును ఎంపీపీగా ఎన్నికైనట్లు ఆర్‌వో ప్రకటించారు.

వైస్‌ ఎంపీపీ ఎన్నికకు వైసీపీ నుంచి పతివాడ శ్రీనివాసరావు పోటీచేయగా వైసీపీకి చెందిన మిగిలిన ఏడుగురు అభ్యర్థులు బలపరచగా, తెలుగుదేశంపార్టీకి చెందిన అభ్యర్థి ఆకిరి జగదీశ్వరరావు, జనసేన నుంచి చింతపల్లి ఎంపీటీసీ అభ్యర్థి పోటీకి దిగారు. అంతలో ఎన్నిక జరపకుండానే వైసీపీకి వైస్‌ ఎంపిపిగా ఆర్‌వో ప్రకటించి డిక్లరేషన్‌ఫాం అందించారు. దీంతో కొద్దిసేపు వివాదం నడిచింది. ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆర్‌వోతో మాట్లాడాక ఆర్‌వో గోపి పత్రికాసమావేశాన్ని నిర్వహించి కోరం లేని కారణంగా వైస్‌ ఎంపిపి ఎన్నిక చెల్లదని, ఈఎన్నికను తిరిగి శుక్రవారం ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

లాటరీలో గుర్ల ఎంపీపీ

గుర్ల, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గుర్ల మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక అనేక మలుపులు తిరిగింది. చివరికి లాటరీలో టీడీపీ నేత వెన్నె సన్యాసినాయుడు ఎంపీపీ అయ్యారు. ఎంపీపీ ఎన్నిక గురువారం గుర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో చేపట్టగా వైసీపీకి చెందిన 9 మంది ఎంపీటీసీలు రిటర్నింగ్‌ అధికారి ఆశయ్య ముందు హాజరయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు కూడా వచ్చారు. వీరితోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నేత రెబెల్‌గా వేసి గెలుపొందిన చింతలపేట ఎంపీటీసీ దాసరి వ నజ కూడా హాజరయ్యారు. ముందుగా రిటర్నింగ్‌ అధికారి ఆశయ 18 మంది ఎంపీటీసీ సభ్యుల దగ్గర నుంచి హాజరు తీసుకున్నారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపీపీ ఎన్నికకు 18 మంది సభ్యుల నుంచి మళ్లీ హాజరు తీసుకున్నారు. అనంతరం ఎంపీపీ ఎన్నికకు నామినేషన్‌ వేయాలని ఆర్వో సూచించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తెట్టంగి ఎంపీటీసీ సభ్యుడు వెన్నె సన్యాసినాయుడు ఎంపీపీ అభ్యర్థిగా తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనకు అదే పార్టీకి చెందిన తాటిపూడి ఎంపీటీసీ సభ్యులు చందక బంగారునాయుడు మద్దతు పలికారు. అనంతరం వైసీపీ నుంచి పాలవలస ఎంపీటీసీ సభ్యుడు పొట్నూరు సన్యాసినాయుడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనకు అదే పార్టీకి చెందిన కోటగాడు ఎంపీటీసీ ముద్దాడ దినేష్‌ మద్దతు తెలిపారు.

అనంతరం చేతులెత్తే పద్ధతిలో రిటర్నింగ్‌ అధికారి ఎంపీపీ ఎన్నిక చేపట్టారు. ముందుగా వెన్న సన్యాసినాయుడుకి మద్దతు తెలుపుతూ చేతులెత్తమనగా ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులతోపాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థి కూడా చేతులెత్తారు. దీంతో వెన్న సన్యాసినాయుడుకి 8 ఓట్లు వచ్చాయి. అనంతరం పొట్నూరు సన్యాసినాయుడుకి వైసీపీ సభ్యులు 8 మంది చేతులు ఎత్తి మద్దతు తెలిపారు. దీంతో ఇటు టీడీపీ, అటు వైసీపీ అభ్యర్థులకు సరిసమానంగా ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. అయితే ఎంపీపీ అభ్యర్థికి స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాకపోవడంతో ఎన్నికల నియమావళి ప్రకారం లాటరీ ద్వారా ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా టీడీపీకి చెందిన సన్యాసినాయుడు పేరును 5 చీటీలలో రాసి మడత పెట్టారు. అలాగే వైసీపీకి చెందిన పొట్నూరు సన్యాసినాయుడు పేరు 5 చీటీలలో రాసి మడత పెట్టారు. వీటిని ఒక డబ్బాలో వేసి కలిపారు. అందులో ఒక చీటి తీసి తెరవగా అదృష్టవశాత్తు తెలుగుదేశం అభ్యర్థి పేరు ఉంది. దీంతో వెన్న సన్యాసినాయుడు గుర్ల మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులుగా ప్రకటించారు. ఇక్కడతో గుర్ల మండలంలో ఎంపీపీ అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది.

ఫ అనంతరం ఉపాధ్యక్షుని ఎన్నిక జరిగింది. ఇప్పుడు కూడా సమానంగా ఓట్లు రావడంతో లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించగా లాటరీలో ఈసారి వైసీపీకి చెందిన ఇండిపెండెంట్‌గా వైస్‌ ఎంపీపీకి నామినే షన్‌ దాఖలు చేసిన పొట్నూరు సన్యాసినాయుడు పేరు వచ్చింది. కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌ అల్లాతోపాటు చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు హాజయ్యారు.

భోగాపురం ఎంపీపీ ఎన్నిక వాయిదా

భోగాపురం, నవంబరు19(ఆంధ్రజ్యోతి):

భోగాపురం ఎంపీపీ ఎన్నిక ఉత్కఠంగా మారింది. గురువారం జరగాల్సిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికకు టీడీపీ, జనసేన, ఇండిపెండెట్లు హాజరు కాకపోవడంతో ఎన్నిక శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రిసైండింగ్‌ అధికారి ఎం.రామారావు ప్రకటించారు. ఈ మండలంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు 16 మంది ఎంపీటీసీ సభ్యులతో ఎంపీటీసీలుగా ప్రమాణ స్వీకారం చేయించి వారి సంతకాలు తీసుకున్నారు. అలాగే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి నిబంధనలను సభ్యులకు చదివి వినిపించి మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని ప్రకటించారు. అయితే సాయంత్రం 4గంటలు దాటినా ఎన్నికల నిర్వహణ హాల్లోకి ఎంపీటీసీ సభ్యులెవరూ హాజరు కాకపోవడంతో ఎన్నికల నియమావళి ప్రకారం కోరం లేనందున ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు పీవో ప్రకటించారు.

టీడీపీ - జనసేన మద్య కుదరని ఒప్పందం

మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 3 టీడీపీ, 3 జనసేన, 4 ఇండిపెండెంట్లు, 6 వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ ఎంపీపీని ఎన్నుకోవడానికి ఏ రాజకీయ పార్టీకి బలం లేదు. టీడీపీ, జనసేన, ఇండిపెండెట్లు కలిస్తే కూటమికి ఎంపీపీ దక్కే అవకాశం ఉంది. భోగాపురం ఎంపీపీ టీడీపీకి కేటాయిస్తే సపోర్టు చేస్తామని, జనసేనకి ఎంపీపీ కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని ఇండిపెండెంట్‌ అభ్యర్థులు పట్టుబట్టినట్లు సమాచారం. అయితే నియోజకవర్గంలో నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ మండలాల ఎంపీపీలు టీడీపీకి కేటాయించామని, భోగాపురం ఎంపీపీ మాత్రం జనసేనకి కేటాయించాలని కూటమి నిర్ణయించినట్లు సమాచారం. అయితే పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్నానని, ఈసారి ఎంపీపీ అవకాశం తన సతీమణికి ఇవ్వాలని టీడీపీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ పట్టుబట్టినట్లు సమాచారం. జనసేనకి ఎంపీపీ ఇచ్చేలా టీడీపీ నాయకుడు సత్యనారాయణను ఒప్పించేందుకు, ఒకతాటిపైకి తెచ్చేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, టీడీపీ నాయకులు భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమైనట్లు సమాచారం.

Updated Date - Nov 20 , 2026 | 12:52 AM