Share News

కూటమి సమన్వయంతో ముందుకు

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:41 AM

కూటమి పార్టీల మధ్య సమన్వయంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధిస్తామని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌ తెలిపారు.

కూటమి సమన్వయంతో ముందుకు
మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు విజయ్‌, చిత్రంలో ఎంపీ కలిశెట్టి, నాగార్జున

స్థానిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్‌రేట్‌ సాధిస్తాం

రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌

విజయనగరం రూరల్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): కూటమి పార్టీల మధ్య సమన్వయంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధిస్తామని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌ తెలిపారు. శుక్రవారం రాత్రి విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను పార్టీ తనకు అప్పగించిందని విజయ్‌ తెలిపారు. తనతో పాటు తణుకు ఎమ్మెల్యే ఆలిమిల్లి రాధాకృష్ణ కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. విజయనగరం నగరపాలక సంస్థ, నెల్లిమర్ల నగర పంచాయతీ, బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయం సాధించడమే తమ లక్ష్యమన్నారు. మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలు సేకరించి, ఏకాభిప్రాయంతో పేర్లను రాష్ట్ర పార్టీకి నివేదించామని చెప్పారు. విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ అభ్యర్థుల పేర్లను సిద్ధం చేసి పంపించామన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ అభ్యర్థుల ఎంపిక శుక్రవారం అర్ధరాత్రికి పూర్తవుతుందని, అభ్యర్థులకు నేరుగా సమాచారం అందిస్తామని చెప్పారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించి టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. శని, ఆదివారాలతో పాటు తుది జాబితా ప్రకటించే వరకు ఈ సెల్‌ పనిచేస్తుందని, ఎన్నికల నిబంధనలు, ఇతర సమస్యలపై అభ్యర్థులకు సహకరిస్తుందని వివరించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రచారాన్ని విస్తృతం చేస్తామన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి ఇద్దరు మాజీ కార్పొరేటర్లు

వైసీపీకి చెందిన మాజీ కార్పొరేటర్లు కేధారశెట్టి సీతారామమూర్తి (రాంపండు), అల్లు చాణక్యతో పాటు వైసీపీ నాయకుడు పిలకా శ్రీను, హుకుంపేటకు చెందిన సురేష్‌ తదితరులు శుక్రవారం టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, జడ్పీ మాజీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు.

Updated Date - Oct 17 , 2026 | 12:41 AM