Move Your Feet కాలు కదిపి.. ఉత్సాహపరిచి!
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:28 AM
Move Your Feet, Boost the Spirit! సాలూరు మండలం తోణాం ఆశ్రమ పాఠశాలను శనివారం జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమయ్యారు. వారితో కలిసి ఏరోబిక్ నృత్యం చేసి అందర్నీ ఉత్సాహపరిచారు.
సాలూరు, జనవరి3(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలం తోణాం ఆశ్రమ పాఠశాలను శనివారం జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమయ్యారు. వారితో కలిసి ఏరోబిక్ నృత్యం చేసి అందర్నీ ఉత్సాహపరిచారు. ఆశ్రమ పాఠ శాలలో వసతులు, భోజనాల నాణ్యత, విద్యార్థుల విద్యాప్రమాణాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మామిడిపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ఈ-క్రాప్ నమోదు, విత్తనాల పంపిణీ తీరును తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా ఆయన సాలూరు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలను సందర్శించి.. రికార్డులను తనిఖీ చేశారు. వసతుల కల్పనపై ఆరా తీశారు. ఆ తర్వాత పట్టణంలో ఆసుపత్రి భవన నిర్మాణాలను పరిశీలించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అక్కడి నుంచి అంటివలస చేరుకుని రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఆయన వెంట రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాల అధికారులు ఉన్నారు.