Motorists face hardship due to Jagan's tour. జగన్ పర్యటనతో వాహనదారుల అవస్థలు
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:21 AM
Motorists face hardship due to Jagan's tour.
జగన్ పర్యటనతో
వాహనదారుల అవస్థలు
పోలీసు ఆంక్షలను ఉల్లంఘించిన వైసీపీ నాయకులు
విజయనగరం దాసన్నపేట, జూలై 30(ఆంధ్రజ్యోతి):
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి వస్తున్న క్రమంలో ర్యాలీలు, కార్లు, మోటార్ సైకిల్ ర్యాలీలకు అనుమతించబోమని ముందుగానే పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ విశాఖపట్టణం నుంచి శ్రీకాకుళం జిల్లా అంపోలు వరకూ ఎక్కడికక్కడే వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి తీవ్ర అసహనానికి గురయ్యారు. వైసీపీ నాయకులు స్వాగత ఏర్పాట్లు పేరుతో భారీ జనసమీకరణకు పాల్పడి పోలీసు ఆంక్షలను సైతం అతిక్రమించారు. జిల్లాలోకి జగన్ కాన్వాయ్ ప్రవేశించిన సమయంలో రాజాపులోవ వద్ద భారీ సంఖ్యలో పార్టీ నాయకుల వాహనాలు తరలివచ్చాయి. దీంతో మిగతా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం భోగాపురం, నాతవలస, పూసపాటిరేగ వరకూ ఇదే పరిస్థితి కనిపించింది.