Share News

Motion in them.. Tension in them వారిలో చలనం.. వీరిలో టెన్షన్‌

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:35 PM

Motion in them.. Tension in them జామిలో గతంలో నిరుపేదలకు ఇచ్చిన డీపట్టా భూములను కొందరు పెద్దలు ఆక్రమించిన వైనంపై ఆంధ్రజ్యోతిలో ‘ఎంతలా మార్చేశారో’ శీర్షికన వచ్చిన కథనం అధికారులను కదిలించింది. డీపట్టా కొనుగోలుదారులకు టెన్షన్‌ పట్టుకుంది. క్షేత్రస్థాయికి వెళ్లిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు అక్రమాలను గుర్తించారు. అక్కడి పాఠశాల భవనానికి అనుమతులు లేవని ఈవో తెలిపారు. నోటీసులు ఇస్తున్నట్లు వెల్లడించారు.

Motion in them.. Tension in them వారిలో చలనం.. వీరిలో టెన్షన్‌
డీపట్టా భూముల్లో నిర్మాణాలను పరిశీలిస్తున్న రెవెన్యూ,పంచాయతీ అధికారులు

వారిలో చలనం.. వీరిలో టెన్షన్‌

‘ఎంతలా మార్చేశారో’ కథనంపై కదలిక

క్షేత్రస్థాయికి రెవెన్యూ, పంచాయతీ అధికారులు

బయటపడిన అక్రమాలు

పాఠశాల భవనానికి అనుమతులు లేవన్న ఈవో

నోటీసులు ఇస్తున్నట్లు వెల్లడి

జామిలో గతంలో నిరుపేదలకు ఇచ్చిన డీపట్టా భూములను కొందరు పెద్దలు ఆక్రమించిన వైనంపై ఆంధ్రజ్యోతిలో ‘ఎంతలా మార్చేశారో’ శీర్షికన వచ్చిన కథనం అధికారులను కదిలించింది. డీపట్టా కొనుగోలుదారులకు టెన్షన్‌ పట్టుకుంది. క్షేత్రస్థాయికి వెళ్లిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు అక్రమాలను గుర్తించారు. అక్కడి పాఠశాల భవనానికి అనుమతులు లేవని ఈవో తెలిపారు. నోటీసులు ఇస్తున్నట్లు వెల్లడించారు.

జామి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జామిలో కారుచౌకగా భూములను కొట్టేసిన వారిలో ఒక వ్యక్తి పెద్ద పాఠశాల భవనాన్ని నిర్మించేశాడు. మరికొందరు ఇళ్లు కట్టేశారు. ఇంకొందరు స్థలాలు అమ్మేయడంతో కొనుగోలుదారులు ఇళ్లు నిర్మించుకున్నారు. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. ఈ అంశాలన్నీ వివరిస్తూ మంగళవారం ముద్రితమైన ఆంధ్రజ్యోతి కథనం సంచలనమైంది. కథనంపై కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి స్పందించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ కృష్ణంరాజును ఆదేశించారు. దీంతో తహసీల్దార్‌ ఆధ్వర్యంలో మండల ఉపసర్వేయర్‌ సత్యం, ఆర్‌ఐ మనోజ్‌కుమార్‌, వీఆర్‌వో అరుణ, వీఆర్‌ఏలు సత్తిబాబు, భాగ్యలతో కలిసి సర్వే నెంబర్‌ 502-1ను మంగళవారం పరిశీలించారు. ఇదే తరుణంలో పంచాయతీ ఈవో ప్రసాద్‌ తన సిబ్బందితో చేరుకొని ఇక్కడి నిర్మాణాలకు అనుమతులు ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. రెవెన్యూశాఖ సర్వే అనంతరం పలు వివరాలు తెలియజేశారు. ఎనిమిది సెంట్ల డీపట్టా స్థలంలో పాఠశాలను నిర్మించడంతో పాటు మరో ఎనిమిది ఎకరాల ఖాళీ స్థలం గుర్తించామని, రెండు శాశ్వత భవనాలతో పాటు మరో రెండు నిర్మాణాలను పరిశీలించామన్నారు. అయితే ఇళ్లు నిర్మించుకుంటున్న వారు తాము వేరే వ్యక్తుల వద్ద స్థలాలు కొనుగోలు చేసి వీటి నిర్మాణం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఖాళీ స్థలాలు ఎవరెవరి చేతుల్లో ఉన్నాయో గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడంతోపాటు ఖాళీ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని ఈవో ప్రకటించారు. దీనిపై తహసీల్దార్‌ కృష్ణంరాజు మాట్లాడుతూ డీపట్టా స్థలంలో అనుమతుల విషయం పూర్తిగా పంచాయతీ అధికారుల చేతుల్లో ఉంటుందని, వారు ఏవిధంగా ఇచ్చారో పరిశీలిస్తామన్నారు. ఇదే విషయంపై పంచాయతీ ఈవో ప్రసాద్‌ మాట్లాడుతూ పాఠశాల నిర్మాణానికి పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేవని, నోటీసులు ఇచ్చి మూడురోజుల్లో వివరణ కోరుతామని, తమ ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని అన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 11:35 PM