More irrigation water from 'Peddagedda' ‘పెద్దగెడ్డ’ నుంచి మరింత సాగునీరు
ABN , Publish Date - May 15 , 2026 | 12:10 AM
More irrigation water from 'Peddagedda' మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ జలాశయానికి అరుదైన పైలట్ ప్రాజెక్టు మంజూరైంది. జలాశయం నుంచి పంటపొలాలకు నేరుగా పైపులైన్లద్వారా సాగునీరందించడమే ఈ పథకం లక్ష్యం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సమృద్ధి పథకం కింద దేశవ్యాప్తంగా పలు ఇరిగేషన్ పథకాలను ఎంపిక చేయగా అందులో పెద్దగెడ్డ ప్రాజెక్టు ఒకటి కావడం విశేషం.
‘పెద్దగెడ్డ’ నుంచి
మరింత సాగునీరు
కేంద్ర ప్రభుత్వ సమృద్ధి పైలట్ ప్రాజెక్టు కింద త్వరలో పనులు
జలాశయం నుంచి పంటపొలాలకు పైపులైన్లు
18న సాలూరులో రైతులకు అవగాహన సదస్సు
కేంద్రం బృందం రాక
బొబ్బిలి, మే 14 (ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ జలాశయానికి అరుదైన పైలట్ ప్రాజెక్టు మంజూరైంది. జలాశయం నుంచి పంటపొలాలకు నేరుగా పైపులైన్లద్వారా సాగునీరందించడమే ఈ పథకం లక్ష్యం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సమృద్ధి పథకం కింద దేశవ్యాప్తంగా పలు ఇరిగేషన్ పథకాలను ఎంపిక చేయగా అందులో పెద్దగెడ్డ ప్రాజెక్టు ఒకటి కావడం విశేషం. దీనిపై బొబ్బిలి ఎస్‌ఈ ఆర్.అప్పారావు, ఈఈల ఆధ్వర్యంలో పెద్దగెడ్డ కుడిప్రధాన కాలువ పరిధిలోని రామభద్రపురం, పాచిపెంట మండలాల ఆయకట్టుదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18న సాలూరులో పార్వతీపురం జిల్లాకలెక్టరు నేతృత్వంలో రైతులకు అవగాహనా సదస్సు నిర్వహిస్తారు. పైలట్ ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రయోజనాలను రైతులకు వివరిస్తారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌తో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు కూడా హాజరుకానున్నారు.
ఫ ప్రధాన పైపులైన్ దూరం సుమారు ఏడు కిలోమీటర్లు ఉంటుంది. దీనికి అనుసంధానంగా డిస్ర్టిబ్యూటరీ లైన్స్ ఉంటాయి. ప్రతీ రెండున్నర ఎకరాలకు పైపు వెళుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భ పైపులైన్ ఏర్పాటు చేస్తారు. శాటిలైట్ అనుసంధానంగా ఈ మొత్తం వ్యవస్థ పనిచేస్తుంది.
లక్ష్యాలు ఇవీ...
ఆయకట్టు భూముల కింద 5 మీటర్ల లోపు పైపులైన్లను ఏర్పాటు చేస్తారు. కాలువల ద్వారా నీటిని ఆయకట్టు భూములకు విడిచిపెట్టినప్పుడు అనేక రకాలుగా సాగునీరు వృథా అవుతుంటుంది. సీపేజ్‌లు, చోరీలు, ఎవాపరేషన్, గండ్లు పడడం తదితర అనేక సమస్యల కారణంగా 63 శాతం నీరు వృథా అవుతుంటుంది. పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తే నూరు శాతం నీటిని ఆదాచేసుకోవచ్చు. అలా మిగిలిన నీటిని రబీ సీజన్‌లో కూడా వినియోగించుకోవచ్చు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే మిగిలిన అన్ని రకాల సాగునీటి ప్రాజెక్టులకు వర్తింపజేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. గ్యాస్, చమురు కోసం పైపులైన్లు వేసినట్లుగా సాగునీటి పైపులైన్లువేసుకుంటే భవిష్యత్‌లో భూసేకరణ సమస్య, ఇతరత్రా వివాదాలు ఉండవనేది అధికారుల భావన.
ఫ రూ.73 కోట్ల రూపాయలతో ఈ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. పెద్దగెడ్డ కుడికాలువ పరిధిలో పాచిపెంట, రామభద్రపురం మండలాలకు చెందిన 7500 ఎకరాల ఆయకట్టుదారులకు అవగాహన కల్పించేందుకు అధికారయంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
ప్రాజెక్టుపై అవగాహనకు సదస్సు
అంబటి పవీణ్‌సాగర్, ఇరిగేషన్ ఏఈ
పెద్దగెడ్డ కుడి పధాన కాలువ పరిధిలో సమృద్ధి పథకం కింద పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసినందున దీనిపై ఈ నెల 18న సాలూరులో కలెక్టరు ఆధ్వర్యంలో రెండు మండలాల రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. బొబ్బిలి ఎస్‌ఈ అప్పారావు, ఈఈ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతారు. పాచిపెంట, రామభద్రపురం మండలాలకు సంబంధించి 7500 ఎకరాల ఆయకట్టు కోసం ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.