Share News

బెడ్లు ఎక్కువ.. సేవలు తక్కువ

ABN , Publish Date - May 21 , 2026 | 10:34 PM

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రూ.19.07కోట్ల నాబార్డు నిధులతో సీతంపేటలో 100 పడకల ఆసుపత్రిని నెలకొల్పింది.

బెడ్లు ఎక్కువ.. సేవలు తక్కువ
సీతంపేట ఏరియా ఆసుపత్రి

-పేరుకే అప్‌గ్రేడ్‌

- వేధిస్తున్న వైద్యుల కొరత

-భర్తీకాని శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది పోస్టులు

- రోగులకు తప్పని ఇబ్బందులు

- ఇదీ సీతంపేట ఏరియా ఆస్పత్రి పరిస్థితి

సీతంపేటరూరల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రూ.19.07కోట్ల నాబార్డు నిధులతో సీతంపేటలో 100 పడకల ఆసుపత్రిని నెలకొల్పింది. ఈ ఆసుపత్రిని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఇటీవల ప్రారంభించారు. ప్రస్తుతం ఓపీ ప్రతిరోజూ 300కు పైగా ఉంటుంది. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం మండలాల నుంచి మెరుగైన వైద్యసేవల కోసం గిరిజనులతో పాటు సామాన్య ప్రజలు సీతంపేట ఏరియా ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇంతవరకు బాగానే ఉన్నా వాస్తవానికి ఈ ఆస్పత్రి వంద పడకలుగా ఇంకా అప్‌గ్రేడ్‌ కాలేదు. ఆసుపత్రిలో 95బెడ్‌లు ఏర్పాటు చేసినప్పటికీ అధికారికంగా 60 బెడ్‌లకు తగ్గ సదుపాయాలు, సిబ్బంది మాత్రమే ఉన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సిబ్బంది, సౌకర్యాల కొరత వేధిస్తోంది. ఇన్‌ పేషెంట్ల కోసం సెకెండ్‌ ఫ్లోర్‌ సిద్ధం చేసినప్పటికీ లిఫ్ట్‌,ర్యాంప్‌ పనులు పూర్తికాకపోవడంతో నడవలేని స్థితిలో ఉన్న రోగులను పైకి తీసుకువెళ్లలేని పరిస్థితి నెలకొంది. చేసేది లేక అటువంటి రోగులను కింద అంతస్తులోనే ఉంచి సేవలందిస్తున్నారు. ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ పనులు కూడా పెండింగ్‌ ఉన్నాయి.

రోగుల తాకిడి..

ఆసుపత్రికి నిత్యం రోగుల తాకిడి ఉంటుంది. ప్రతిరోజూ 300 వరకు ఓపీ నమోదవుతుండగా సోమవారం 400 పైగా ఉంటుంది. ఇన్‌పేషేంట్లు 30 నుంచి 50వరకు ఉంటారు. నెలలో సుమారు వందకు పైగా ప్రసవాలు జరుగుతుంటాయి. ప్రతినెలా ఆర్థో, గైనిక్‌, సాధారణ శస్త్ర చికిత్సలు 40కిపైగా జరుగుతుంటాయి. ఇక ఎపిడమిక్‌ సీజన్‌లో అయితే రోగులతో ఆసుపత్రి కిక్కిరిసి ఉంటుంది. ఇంత రద్దీగా ఉండే ఆసుపత్రిలో వైద్య, శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

వైద్యాధికారుల కొరత..

ప్రధానంగా ఆసుపత్రిలో రెగ్యులర్‌ పిడియాట్రిక్‌ వైద్యుల పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు వైద్యుల్లో ఒకరు పదోన్నతిపై వెళ్లిపోగా, మరొకరు మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు. దీంతో పాలకొండ నుంచి రవికుమార్‌ అనే చిన్నపిల్లల వైద్యుడు వారానికి మూడు రోజులు డెప్యుటేషన్‌పై సీతంపేట ఆసుపత్రికి వచ్చి సేవలందిస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఎన్‌ఆర్‌పీ(న్యూట్రిషన్‌ రిహేబిటేష్‌న్‌ సెంటర్‌)వైద్యులు చిన్నపిల్లలను చూస్తున్నారు. నేత్ర(అప్తలామిస్ట్‌), చర్మవ్యాధుల (డెర్మటాలజిస్ట్‌)వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను రెగ్యులర్‌ వైద్యాధికారులతో భర్తీచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో మైదాన ప్రాంతాల్లోని ప్రైవేట్‌ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని రోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీతంపేట ఏరియా ఆసుపత్రిని వంద పడకలుగా అప్‌గ్రేడ్‌ చేసి సిబ్బంది భర్తీతో పాటు మౌలిక సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించేలా చర్యలు తీసుకోవాలని గిరిజనసంఘాల నాయకులు, గిరిజనులు కోరుతున్నారు.

వైద్యుల కొరత మాట వాస్తవమే

60పడకలుగా ఉన్న సీతంపేట ఏరియా ఆసుపత్రి 100పడకలుగా అప్‌గ్రేడ్‌ అయింది. వైద్యుల కొరత ఉన్నమాట వాస్తవమే. వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి లేఖం రాశాం. వైద్య సిబ్బందితో పాటు శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది పోస్టులపై కూడా ప్రభుత్వానికి నివేదించాం. సీతంపేటలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయిన వెంటనే ఏరియా ఆసుపత్రిలో లిఫ్ట్‌, ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ వంటి సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి.

-నాగభూషణం, జిల్లా ఏరియా ఆసుపత్రుల సమన్వయాధికారి.

Updated Date - May 21 , 2026 | 10:34 PM