Monsoon Season వానాకాలం.. కలుషిత నీరే తాగాలా?
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:47 PM
Monsoon Season: Must We Drink Contaminated Water? జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకతో మున్ముందు భారీగా పడే అవకాశం ఉంది. అయితే పార్వతీపురంలో తాగునీటి సరఫరాపై మాత్రం ఇంజనీరింగ్ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు.
కానరాని ముందస్తు చర్యలు
స్పందించని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు
పెదవి విరుస్తున్న జిల్లాకేంద్ర వాసులు
పార్వతీపురం టౌన్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకతో మున్ముందు భారీగా పడే అవకాశం ఉంది. అయితే పార్వతీపురంలో తాగునీటి సరఫరాపై మాత్రం ఇంజనీరింగ్ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఎక్కడిపడితే అక్కడ ప్రధాన పైప్‌లైన్ లీకవుతోంది. మరోవైపు పంప్‌హౌస్ వద్దగల నాగావళి నదిలోని ఇన్‌ఫిల్టర్ బావుల్లో వరదనీరు చేరే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఏటాలానే ఈ సారి కూడా పట్టణవాసులు కలుషిత నీరే గతి అవుతుంది. రంగు మారిన, బురద నీరే వినియోగించాల్సిన దుస్థితి. వర్షాకాలం ముంచుకొస్తున్నప్పటికీ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ముందస్తు చర్యలేవీ చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పార్వతీపురం పురపాలక సంఘంలో 30 వార్డులు ఉన్నాయి. ఎప్పుడో 1964లో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ ద్వారానే తాగునీటి సరఫరా చేస్తున్నారు. పట్టణంలో 80 వేల వరకు జనాభా ఉంటారు. జిల్లాకేంద్రం కావడంతో రోజురోజుకూ జనాభా పెరుగుతోంది. పట్టణ శివారుల్లో కాలనీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అయితే తాగునీరు మాత్రం పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. వేసవిలో నాలుగైదురోజులకొకసారి నీరు సరఫరా చేస్తుండగా.. వర్షాకాలంలో మాత్రం కలుషిత నీటినే అందిస్తున్నారు. ఏటా ఈ సమస్య ఉన్నా.. అధికారులకు ఏమీ పట్టడం లేదు. వాస్తవంగా పట్టణ ప్రజలకు రోజుకు రెండు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నాలుగు నుంచి ఐదురోజులకొకసారైనా 50 వేల లీటర్లను సరఫరా చేయలేకపోతున్నారు. పార్వతీపురం పట్టణ ప్రజల దాహార్తి తీర్చడం కోసం 2008లో రూ.10 కోట్లతో నాగావళి నది నుంచి ఏర్పాటు చేసిన పైప్‌లైన్ వృఽథాగానే ఉంది. దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
లీకులు బాబోయ్ లీకులు..
కాలం చెల్లిన ప్రధాన పైప్‌లైన్‌కు ఎక్కడ పడితే లీకులు పడడడంతో తాగునీరు వృథాగా పోతుంది. ఏటా పైప్‌లైన్‌లు, ప్రధాన, బూస్టర్ హౌస్‌లోని మోటార్ల మరమ్మతుల కోసం అధికారులు రూ.20లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వెస్తున్నారు. అయినప్పటికీ పట్టణ జనాభాకు తగ్గట్టుగా తాగునీటి సరఫరా చేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న 30 వార్డులు త్వరలో 36 కానున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా ఎలా చేయగలరనేది అధికారులకే తెలియాలి.
వర్షాకాలంలో నాగావళి నదిలో ఉన్న ఇన్‌ఫిల్టర్ బావుల్లోకి వరదనీరు చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు. నాగావళి నదిలోని ఇన్‌ఫిల్టర్ బావులతో పాటు ప్రధాన, బూస్టర్ పంప్‌హౌస్‌ల్లో నీటిని తోడే మోటార్ల స్థానంలో కొత్తవాటినీ కొనుగోలు చేయడం లేదు. మొత్తంగా ఈ ఏడాదీ పట్టణ ప్ర‘జల’కు కష్టాలు తప్పేలా లేవు. కలుషితనీటి కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వర్షాకాలంలో కలుషితనీరే గతి
ఏటా వర్షాకాలంలో కుళాయిల ద్వారా కలుషితనీరే సరఫరా అవుతుంది. ఈ నీటిని వినియోగించలేకపోతున్నాం. ప్ర‘జల’ కష్టాలు తీర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
- వి.భాస్కరరావు, పార్వతీపురం, సారికివీధి
====================================
ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకెళ్తా..
పట్టణంలో సంపూర్ణ తాగునీటి సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.86 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులు విడుదలైతే ప్ర‘జల’ కష్టాలు తీరుతాయి. కాగా తాగునీటి సరఫరాకు సంబంధించి ప్రత్యేక నిధుల మంజూరు విషయాన్ని మున్సిపల్ ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకెళ్లి తాగునీటి సరఫరా సమస్యను పరిష్కరిస్తాం.
- శ్రీనివాసరాజు డీఈ, ఇన్‌చార్జి కమిషనర్, పార్వతీపురం