Ration Distribution రేషన్ పంపిణీపై పర్యవేక్షణ
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:09 PM
Monitoring of Ration Distribution జిల్లాలో 576 రేషన్ దుకాణాల్లో జరిగే సరుకుల పంపిణీని అబా (ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ) ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అబా పోస్టర్‌ను ఆవిష్కరించారు.
పార్వతీపురం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 576 రేషన్ దుకాణాల్లో జరిగే సరుకుల పంపిణీని అబా (ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ) ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అబా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా, సమర్థవంతగా నిర్వహించేందుకు అబా దోహదపడు తుందన్నారు. మండల స్థాయి బృందాలు తనిఖీలు నిర్వహించి లోపాలను గుర్తించి సరిదిద్దుతాయని వెల్లడించారు. రోజువారీ సరుకుల పంపిణీ వివరాలు ప్రత్యేక సమాచార వ్యవస్థ ద్వారా నివేదించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి, సబ్ కలెక్టర్ సచిన్ అర్పిత్ రహర్ డీఎస్‌వో అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీల్లో ‘మన్యం మర్యాద’ అమలు
జిల్లాలోని అన్ని పంచాయతీల్లో మన్యం మర్యాద కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే వాయిద్యాలు మోగిస్తూ పూలు అందించి వినూత్నంగా చైతన్య పర్చాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాలు, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు పాటించని కార్యాలయాల్లోనూ మన్యం మర్యాద బృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.