Monitoring of gas usage గ్యాస్ వాడకంపై నిఘా
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:10 AM
Monitoring of gas usage శృంగవరపుకోట పట్టణ పరిధిలో టిఫిన్ దుకాణం, హోటల్‌లో శనివారం పౌరసరఫరాల శాఖ ఉప తహసీల్దార్ జయలక్ష్మి తనిఖీలు నిర్వహించారు. విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రైవేటు ఆసుపత్రి ఎదురుగా ఉన్న హోటల్‌లో గృహ వినియోగానికి వాడాల్సిన మూడు గ్యాస్ సిలిండర్‌లు, శ్రీనివాసకాలనీలోని ఓ టీఫిన్ దుకాణంలో రెండు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసి స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు అప్పగించారు.
గ్యాస్ వాడకంపై నిఘా
హోటళ్లు, టీ దుకాణాలపై దాడులు చేస్తున్న పౌరసరఫరాల శాఖ
స్వాధీనం చేసుకుంటున్న గృహ వినియోగ సిలిండర్లు
గ్యాస్ ఏజెన్సీలకు అప్పగింత
కేసులు నమోదు
ఎలా బయటకు వస్తున్నాయో తేల్చని అధికారులు
- శృంగవరపుకోట పట్టణ పరిధిలో టిఫిన్ దుకాణం, హోటల్‌లో శనివారం పౌరసరఫరాల శాఖ ఉప తహసీల్దార్ జయలక్ష్మి తనిఖీలు నిర్వహించారు. విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రైవేటు ఆసుపత్రి ఎదురుగా ఉన్న హోటల్‌లో గృహ వినియోగానికి వాడాల్సిన మూడు గ్యాస్ సిలిండర్‌లు, శ్రీనివాసకాలనీలోని ఓ టీఫిన్ దుకాణంలో రెండు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసి స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు అప్పగించారు.
- కొత్తవలస పట్టణ పరిధిలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని కూడలిలో శుక్రవారం పౌరసరఫరాల శాఖ ఉప తహసీల్దార్ ఎస్.చిరంజీవి ఓ టీఫిన్ సెంటర్‌లో తనిఖీలు చేశారు. మూడు గృహ వినియోగా గ్యాస్ సిలిండర్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని వాడుతున్న యజమానిపై 6ఎ కేసు నమోదు చేశారు.
- లక్కవరపుకోట, వేపాడ మండలాల పరిధిలో విశాఖ-అరకు రోడ్డులో ఉన్న టీదుకాణాలు, హోటళ్లలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు గురువారం దాడులు చేశారు. ఎల్.కోట మండలం రంగారాయపురంలో ఓ కిరాణ దుకాణంలో ఆరు గృహ వినియోగ సిలిండర్‌లు, సంతపేట కూడలిలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి రెండు గృహ వినియోగ సిలిండర్‌లు, వేపాడ మండలం బొద్దాం కూడలిలోని ఓ రెండు దుకాణాల నుంచి ఎనిమిది గృహ వినియోగ సిలిండర్‌లను పట్టుకున్నారు.
శృంగవరపుకోట, మార్చి 15(ఆంధ్రజ్యోతి):
పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్, చమురు కొరత వస్తుందని భయపడుతున్న వినియోగదారులు, వ్యాపారులు గ్యాస్‌ను స్టాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గృహ వినియోగ సిలిండర్లను వ్యాపారులు వేర్వేరు మార్గాల్లో తెప్పించుకుని వినియోగిస్తున్నారు. ఈ విషయం తెలిసి జేసీ సేతుమాధవన్ తనిఖీలకు ఆదేశించారు. నాలుగు రోజులుగా జిల్లాలోని పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆ శాఖ విజిలిన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు కిరాణా, హోటల్స్, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై దాడులు చేస్తున్నారు. వీరు తనిఖీ చేపట్టిన ప్రతిచోటా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లు పట్టుబడుతున్నాయి. వాటిని తిరిగి ఆయా గ్యాస్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లను ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. వీటి ధర తక్కువగా ఉంటుంది. వీటిని కేవలం గృహ అవసరాలకే ఉపయోగించాలి. వాణిజ్యపరంగా ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధం. కానీ పెద్ద పెద్ద హోటళ్ల నుంచి రోడ్లపై ఉండే చిన్న చిన్న హోటళ్ల వరకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ల వాడకం సాగుతోంది. అయితే పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు చిన్న దుకాణాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. పెద్ద పెద్ద హోటల్స్, పేరున్న భోజన హోటల్స్ జోలికి పోవడం లేదు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లు వాణిజ్య అవసరాలకు ఎలా చేరుతున్నాయో పౌరసరఫరాల శాఖ అధికారులు, ఏజెన్సీల నిర్వాహకులే సమాధానం చెప్పాలి.
- ఒక సిలిండర్ డెలవరీ జరిగిన తరువాత గృహ వినియోగానికి మరో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొనేందుకు సుమారు 25 రోజుల సమయం పడుతుంది. గడువుకు ముందు గృహ వినియోగదారులు పెళ్లి, పేరంటం ఉందని అడిగినా గ్యాస్ ఏజెన్సీలు కరుణించవు. వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌లు ఒకరోజు, రెండు రోజులకంటే ఎక్కువ రావు. వీరి వద్దకు రెండు నుంచి పది గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ల ఎలా ఉంటున్నాయో అంతుపట్టని విషయం. పౌరసరఫరాల శాఖ అధికారులు దీన్ని తేల్చకుండా వాడే వారిపై ప్రతాపం చూపుతున్నారు.
జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లు 3,46,457, దీపం 1,85,254, ఉజ్వల 1,29,277, సీఎస్‌ఆర్ 43,287 కన్‌క్షన్‌లు ఉన్నాయి. వీటన్నింటినీ జిల్లాలోని 35 గ్యాస్ ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి. 14.2 కేజీలుండే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లను ప్రస్తుతం రాయితీపై రూ.920కు విక్రయిస్తున్నారు. 19కేజీల వున్న వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ ధర రూ.1936.50 ఉంది. దీనికి ఎటువంటి రాయితీ ఉండదు. వ్యాపారులు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (రాయితీ)లను వాడడం నిషేధం. వాడితే అధికారులు 6ఏ కేసులను నమోదు చేస్తారు. కానీ వాణిజ్య సిలిండర్‌ల కంటే రాయితీపై దొరికే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లను వాణిజ్య అవసరాలకు ఎక్కువగా వాడేస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ అధికారులు సీరియస్‌గా తీసుకోలేదు. అయితే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితిలో ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో గృహ వినియోగదారులు గ్యాస్ కోసం చాలా యాతన పడుతున్నారు. సిలిండర్ ఖాళీ అవగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసేస్తున్నారు. గ్యాస్ డెలవరీ బాయ్ ఇంటికి రాకముందే గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితిలో గ్యాస్ పక్కదారి పట్టకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. విస్తృతంగా తనిఖీలకు వెళ్తున్నారు. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్న మాటలను ఎవరూ వినిపించుకోవడం లేదు. ఏజెన్సీల వద్ద బారులుతీరుతున్నారు.