అమ్మా!.. భయమేస్తోంది..
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:07 AM
మండలంలోని సంకిలి గ్రామానికి చెందిన గుండ లావణ్యకుమార్ అనే యువకుడు గల్ఫ్‌దేశం అబుదాబిలో చిక్కుకున్నాడు.
-నా దగ్గర బాంబులు పడుతున్నాయ్!
- భయంతో కాలం గడుపుతున్నా..
- అబుదాబిలో చిక్కుకున్న సంకిలి యువకుడు
- మా బాబును రక్షించరూ!
- ప్రభుత్వానికి తల్లిదండ్రుల వేడుకోలు
రేగిడి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సంకిలి గ్రామానికి చెందిన గుండ లావణ్యకుమార్ అనే యువకుడు గల్ఫ్‌దేశం అబుదాబిలో చిక్కుకున్నాడు. ఇంటర్ పూర్తిచేసిన లావణ్యకుమార్ ఉపాధి కోసం ఇటీవల అబుదాబి వెళ్లాడు. అక్కడ ముసాఫా ప్రాంతంలో ఓ కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. సెలవులకు గత నెల 28న ఇండియాకు రావాల్సి ఉంది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంగా కారణంగా విమానాలు రద్దు కావడంతో అక్కడ చిక్కుకుపోయాడు. తాను ఉన్న ప్రాంతంలో అమెరికన్ ఎయిర్ బేసిన్‌లు ఉన్నాయని, ఆ ప్రాంతంలో బాంబులు పడుతుండడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నానని తన తల్లిదండ్రులు శ్రీనివాసరావు, భవానికి శుక్రవారం ఫోన్ చేసి చెప్పాడు. తనతో పాటు తెలుగువారు మరో 12మంది ఉన్నట్లు లావణ్య కుమార్ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పాడు. తమ ఒక్కగానొక్క కుమారుడిని రక్షించాలని, ఇండియాకు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కృషి చేయాలని లావణ్యకుమార్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.