MLA sir.. what do you say about the land dispute? ఎమ్మెల్యే గారూ.. భూ వివాదంపై ఏమంటారు?
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:12 AM
MLA sir.. what do you say about the land dispute? ఎమ్మెల్యే గారూ.. బొబ్బిలిలో 1991లో కాంగ్రెస్ పార్టీ పేదలకు భూమి ఇచ్చిందట...దానిని మీరు, మీ అనుచరులు కలిసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై ఏమంటారు అంటూ బేబీనాయనను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
ఎమ్మెల్యే గారూ.. భూ వివాదంపై ఏమంటారు?
బేబీనాయనను ప్రశ్నించిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
బొబ్బిలి రచ్చబండలో ఉండగా ఫోన్
వందలాది ఎకరాలను దానం చేశాం...వారి భూములు మాకెందుకు అంటూ
కొట్టిపారేసిన ఎమ్మెల్యే
బొబ్బిలి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):
ఎమ్మెల్యే గారూ.. బొబ్బిలిలో 1991లో కాంగ్రెస్ పార్టీ పేదలకు భూమి ఇచ్చిందట...దానిని మీరు, మీ అనుచరులు కలిసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై ఏమంటారు అంటూ బేబీనాయనను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బొబ్బిలి మండలం పారాది గ్రామంలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ఆమెకు బొబ్బిలిలో సర్వేనెంబరు 635లో ఏడు ఎకరాలను ఎమ్మెల్యే బేబీనాయన లాక్కున్నారని కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆమె నేరుగా ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడారు. దీనికి ఎమ్మెల్యే బేబీనాయన బదులిస్తూ ‘వందలాది ఎకరాలను మేమే దానం చేశాం. మేమెందుకు కబ్జాలకు పాల్పడతాం. ఇతరుల భూములు మాకెందుకు?’ అని వివరించారు. ‘రాజాం ప్రాంతంలో బిజీ కార్యక్రమంలో ఉన్నానని, ఫిర్యాదుదారులు మిమ్నల్ని తప్పుదోవపట్టిస్తున్నారని, వాస్తవాన్ని మీకు స్వయంగా వచ్చి చెబుతానని’ అన్నారు. ఈ దశలో ఇద్దరి మధ్య కొద్దిసేపు ఇంగ్లీషులో వాదన జరిగింది. అనంతరం ఫోన్ కాల్ కట్ అయింది. అనంతరం ఆమె కలెక్టర్ రామసుందర్‌రెడ్డికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మరిపి వినయ్, బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి మువ్వల శ్రీనివాసరావు, ఇతర ముఖ్యనాయకులు, ప్రజలు పాల్గొన్నారు.