మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:27 AM
‘రాష్ట్ర ప్రభుత్వం షోలు చేయడం లేదు. సదస్సులు ఏర్పాటు చేసి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది.’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
కొత్త పరిశ్రమలకు
మార్గం సుగమం చేస్తున్నాం
- వోక్స్ వ్యాగన్ని తరిమింది ఎవరు?
- ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క కొత్త పరిశ్రమైనా వచ్చిందా?
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం రూరల్, నవంబరు 15 ( ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రభుత్వం షోలు చేయడం లేదు. సదస్సులు ఏర్పాటు చేసి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది.’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క కొత్త పరిశ్రమైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. ఆ దిశగా కనీసం ప్రయత్నం జరగలేదన్నారు. ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్లాయన్నారు. ‘ఉత్తరాంధ్రలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఘన కార్యం వల్ల వోక్స్వ్యాగన్ రాష్ట్రానికి రాకుండా పోయిందన్నారు. డబ్బులు పోనాయ్ అంటూ సత్తిబాబు అనాడు చెప్పిన విషయాన్ని మంత్రి కొండపల్లి గుర్తు చేశారు. ‘బొత్స ఏదేదో మాట్లాడుతుంటారు. ఆయన మాటలకు అర్ధాలు వేరుగా ఉంటాయి. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. 2024 సాధారణ ఎన్నికల మాదిరిగా, స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో బొత్సతో పాటు వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కూటమి అభ్యర్థుల విజయానికి శ్రీరామరక్షగా నిలిచాయి.’ అని అన్నారు.