Share News

Milling నిలిచిన మిల్లింగ్‌

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:33 AM

Milling Comes to a Standstill జిల్లాలోని పలు రైస్‌ మిల్లుల పరిధిలో ధాన్యం మిల్లింగ్‌ నిలిచింది. ఎఫ్‌సీఐ గోదాములు ఖాళీగా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

 Milling నిలిచిన మిల్లింగ్‌
నాగూరు రైస్‌ మిల్లు ఆవరణలో ధాన్యం నిల్వలు ఇలా..

  • మిల్లుల పరిధిలో పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు

  • తలలు పట్టుకుంటున్న మిల్లర్లు

గరుగుబిల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు రైస్‌ మిల్లుల పరిధిలో ధాన్యం మిల్లింగ్‌ నిలిచింది. ఎఫ్‌సీఐ గోదాములు ఖాళీగా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మిల్లింగ్‌ చేయకపోవడంతో మిల్లుల ప్రాంగణాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. మరోవైపు క్యూ ఆర్‌ కోడ్‌ విధానంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మిల్లర్లు చెబుతున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌ రైతుల నుంచి 2.50 లక్షల మెట్రిక్‌ టన్నులు మేర ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 175 కేంద్రాల పరిధిలో 32,946 మంది రైతుల నుంచి 2,12,485 మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం సేకరించారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 481.29 కోట్లు జమ చేశారు. కాగా మరో 20 వేల మెట్రిక్‌ టన్నుల సేకరణకు ఉన్నతాధి కారులకు ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు మార్చి నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించనున్నారు.

జిల్లాలోని 111 రైస్‌ మిల్లులకు బ్యాంకు గ్యారెంటీలకు అనుగుణంగా నిల్వలు చేరాయి. కొద్ది రోజులు మిల్లింగ్‌ చేసిన తర్వాత.. తక్కువ స్థాయిలోనే ఆయా ఎఫ్‌సీఐ గోదాములకు బియ్యం నిల్వలను తరలించారు. కాగా ప్రస్తుతం సూరంపేట, అంటిపేటతో పాటు పలు గోడౌన్లు ఖాళీగా లేవు. ఆయా ప్రాంతాల్లో బియ్యం నిల్వలు అధికంగా ఉన్నట్లు సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. దీంతో జిల్లాలో మిల్లుల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. వర్షం కురిస్తే అవి పాడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు కప్పి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. కాగా మిల్లింగ్‌ నిలిచిపోవడంతో మరోవైపు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండుగ ముందు ఈ సమస్య నెలకొనడంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

నిబంధనల మేరకే తరలింపు

జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్లు ఖాళీగా లేవు. ఈ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశాం. రైస్‌ మిల్లుల్లో మిల్లింగ్‌ చేసిన బియ్యం నిల్వలను నిబంధనల మేరకే గోడౌన్‌లకు తరలిస్తాం.

- శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌, పార్వతీపురం మన్యం

==================================

మేనేజింగ్‌ డైరెక్టర్‌కి తెలియజేశాం..

మిల్లుల్లో నిలిచిన మిల్లింగ్‌ సమస్యను రాష్ట్ర పౌర సరఫరాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. క్యూ ఆర్‌ కోడ్‌ విధానంలో ఇబ్బందులు ఎదురవు తున్నాయి. ఈ మేరకు నిబంధనలు సడలించాల్సి ఉంది. ఈ సమస్య రెండు రోజుల్లో పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

- బి.రామ్‌మోహనరావు, జిల్లా రైస్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షులు

Updated Date - Jan 10 , 2026 | 12:33 AM