drop off his sister...అక్కను దిగబెట్టేందుకు వెళుతూ మృత్యుఒడికి..
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:34 PM
Met a fatal end while on the way to drop off his sister... తన అక్క, మేనల్లుడును వారింటి వద్ద దింపేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.
మన్యం జిల్లావాసి మృతి
పెందుర్తి (విశాఖపట్నం), సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తన అక్క, మేనల్లుడును వారింటి వద్ద దింపేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కల్లికోటకు చెందిన బోను రాంబాబు (26) ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం తన అక్క ధనలక్ష్మి, ఆరేళ్ల మేనల్లుడు దేవ్‌ను గాజువాకలోని వారింటికి దిగబెట్టేందుకు కల్లికోట నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో విశాఖ జిల్లా పెందుర్తి ఎన్‌హెచ్-16 సమీప అక్కిరెడ్డిపాలెం వద్దకు వచ్చేసరికి యూటర్న్ తీసుకోవడం రాంబాబు మరిచిపోయాడు. దీంతో వాహనాన్ని రివర్స్ చేయడంతో అదే మార్గంలో వేగంగా పెందుర్తి వైపు నుంచి వస్తున్న వ్యాన్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ వెనక కూర్చున్న ధనలక్ష్మి, దేవ్‌లు కిందపడిపోగా, రాంబాబు పైనుంచి వ్యాన్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ధనలక్ష్మి, దేవ్‌లను ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్‌లో నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. రాంబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.