Medical assurance వైద్యానికి భరోసా
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:54 PM
Medical assurance శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి భవనాలకు మోక్షం కలుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం వాటిని ప్రారంభించనున్నారు. నూతనంగా డయాలసిస్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
వైద్యానికి భరోసా
ఎస్.కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి భవనాలకు మోక్షం
రేపు ప్రారంభించనున్న మంత్రి సత్యకుమార్ యాదవ్
అందుబాటులోకి వస్తున్న డయాలసిస్ సేవలు
శృంగవరపుకోట, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):
శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి భవనాలకు మోక్షం కలుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం వాటిని ప్రారంభించనున్నారు. నూతనంగా డయాలసిస్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇకపై పెరిగిన స్థాయికి అనుగుణంగా వైద్యం అందుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో జనవరి ఐదో తేదీన ఐదేళ్లయినా పూర్తికాలే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇంకా భవన నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ఇటు రోగులు, ఆటు వైద్యులు పడుతున్న ఇబ్బందులను వివరించింది. దీనికి స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ త్వరితగతిన పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఈ భవనాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. విశాలమైన ఈ ఆసుపత్రి ప్రాంగణంలో ఇకనుంచి మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిగా వున్న దీన్ని 2014-2019లో అధికారంలో వున్న తెలుగు దేశం పార్టీకి చెందిన అప్పటి, ఇప్పటి శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయిని పెంచాలని అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడ్ని కోరారు. ఈమేరకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయి పెంచారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020లో తామే స్థాయిని పెంచినట్లు నోటిఫికేషన్ ఇచ్చుకున్నారు. నూతనంగా భవనాల నిర్మాణం చేపట్టేందుకు రూ.12.60 కోట్లు కేటాయించారు కానీ భవనాలను పూర్తి చేయలేకపోయారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ భవనాలపై ప్రత్యేక దృష్టిసారించింది. భవనాలు పూర్తియ్యాయి. ఇంతవరకు సామాజిక ఆసుపత్రి స్థాయిలో వున్న భవనాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించలేక వైద్యులు సతమతమయ్యారు. ఇద్దరు నుంచి నలుగురు వరకు ఒకే గదిలో వుండి వైద్య సేవలు అందించాల్సి వచ్చేది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు.
అందుబాటులోకి డయాలసిస్ సేవలు
మూడు నెలల క్రితమే కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతీయ ఆసుపత్రికి డయాలసిస్ కేంద్రాన్ని కేటాయించింది. కొత్తభవనాలు అందుబాటులోకి రావడంతో డయాలసిస్ సేవలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ నియోజకవర్గంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన రెండు, మూడు మండలాలకు చెందిన గిరిజన ప్రజలు డయాలసిస్ కోసం విశాఖ కేజీహెచ్, ఇతర ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారందరికి వ్యయ, ప్రయాసలు తగ్గనున్నాయి.
గజపతినగరం ఆస్పత్రికీ కొత్త రోజులు
రేపు ప్రారంభం కానున్న కొత్త భవనాలు
గజపతినగరం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి కొత్త భవనాలను ఈనెల 2న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ 40 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకు గత టీడీపీ హయాంలోనే నిధులు మంజూరయ్యాయి. 2019లోరూ.17కోట్లు నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిలిచిపోయాయి. తరువాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఆస్పత్రిని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రద్ధ తీసుకొని పనులు వేగవంతంగా జరిగేలా అధికారులకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. పనులు పూర్తికావడంతో ఈ నెల 2న మధ్యాహ్నం మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌జగదీష్ తెలిపారు. డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి కూడా ఆసుపత్రిలో వివిధ విభాగాలకు సంబంధించిన పనులను గతంలో పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.