El Niño ఎల్‌నినోను ఎదుర్కొనేలా చర్యలు
ABN , Publish Date - May 23 , 2026 | 12:28 AM
Measures to Tackle El Niño Effects ఎల్‌నినో ముప్పు ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాస్థాయి ఎల్‌నినో ఉపశమన చర్యల ప్రణాళిక బుక్‌లెట్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.
ప్రకృతి సాగు కార్యాచరణపై బుక్‌లెట్ ఆవిష్కరణ
పార్వతీపురం, మే 22(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ముప్పు ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాస్థాయి ఎల్‌నినో ఉపశమన చర్యల ప్రణాళిక బుక్‌లెట్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. వాతావరణ మార్పులు, తీవ్ర ఎండలు, వర్షాభావం వంటి పరిస్థితులు, ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ బుక్‌లెట్‌ను రూపొందించినట్టు కలెక్టర్ వెల్లడించారు. నేలలో తేమను కాపాడే విధానం, ముందస్తు పొడి విత్తన విధానం వంటి వాటిపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల సమన్వయంతో క్షే త్రస్థాయి సిబ్బంది, వ్యవసాయాధికారులు , డిజిటల్ ప్లాట్‌ఫారాల ద్వారా రైతులకు సమయానుకూల శాస్ర్తీయ సలహాలు అందించాలని సూచించారు. ఈ ప్రణాళికను విజయవంతం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేయాలి..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో శతశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ముందుగా జిల్లాలో మరుగుదొడ్లు నిర్మాణాలు తదితర అంశాలపై నవ్యాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జునరావు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 13,731 మరుగుదొడ్ల నిర్మాణాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. దీని కోసం 16.47 కోట్లు కేటాయించినట్టు వివరించారు. ఈ సమావేశంలో డీఆర్వో హేమలత పాల్గొన్నారు.
మరో ఐదు రోజులు.. అధిక ఉష్ణోగ్రతలు
జిల్లాలో మరో ఐదు రోజుల పాటు అధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జిల్లాలోని 15 మండలాలు డేంజర్ కేటగిరీలో ఉన్నాయన్నారు. 41 నుంచి 54 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.