Tribes షెడ్యూల్డ్ తెగల హక్కుల పరిరక్షణకు చర్యలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:25 AM
Measures to Protect the Rights of Scheduled Tribes జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, తెగల హక్కుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల ప్రతినిధులతో సమీక్షించారు.
పార్వతీపురం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, తెగల హక్కుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కమిటీ ఎప్పుడూ అండగా ఉంటుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసుల్లో పురోగతి, విచారణ తీరును పరిశీలిస్తుంది. నిందితులకు శిక్ష పడేలా తీసుకుంటున్న చర్యలను కమిటీ సమీక్షిస్తుంది. షెడ్యూల్డ్ తెగలు, కులాల వారికి న్యాయం అందేలా చూస్తుంది. ’ అని తెలిపారు. ముందుగా జియమ్మవలస మండలం చింతలబెలగాంలో శ్మశానవాటిక స్థలం, తురకనాయుడువలసలో కుల ధ్రువీకరణ పత్రం మంజూ రుపై కలెక్టర్ ఆరా తీశారు. శ్మశాన వాటికల అవసరాలు గుర్తించి వాటి మంజూరుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాటి కోసం నివేదికలు సిద్ధం చేసి తర్వాత జరగబోయే సమావేశంలో అందించాలన్నారు. పోలీస్, సామాజిక సంక్షేమ, ఆదివాసీ సంక్షేమ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో అవగాహనా కార్యక్ర మాలు నిర్వహించాలన్నారు. షెడ్యూల్డ్ తెగలపై దాడుల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో ఆక్రమణలో ఉన్న దళిత రైతుల భూములపై దృష్టి సారించాలన్నారు. ఈ సమవేశంలో ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో కె.హేమలత, సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.శ్యామల తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అధికారుల తీరుపై అసహనం
ప్రభుత్వ ప్రాధాన్య పనులపై కొందరు రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న పనికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ అవసర మని భావించడం సరికాదన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ.. మరింత సమర్థంగా పనిచేయడానికి పక్కా ప్రణాళిక, ప్రాధాన్యతల గుర్తింపు అత్యవసరమన్నారు. వీఆర్‌వోల పనితీరు మెరుగుకు అధికారులే స్వయంగా రంగంలోకి దిగాలని ఆదేశించారు. ప్రతి వీఆర్‌వోకు సోమవారం నుంచి శనివారం వరకు స్పష్టమైన షెడ్యూల్ ఉండా లన్నారు. ఏ రోజు ఏ ఫైల్ నెంబర్‌పై విచారణ చేయాలి, ఏ మ్యూటేషన్ కేసులు పరిష్కరించాలనే అంశాలపై స్పష్టమైన వర్క్ ఆర్డర్ ఇవ్వాలని సూచించారు. ఒక వీఆర్‌వోపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఖాళీగా ఉన్న మరో వీఆర్‌వోకు ఆ బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, మొబైల్ ఫోన్ల ద్వారా నివేదికలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌లో దరఖాస్తుదారుల వివరాలను నేరుగా గూగుల్ ఫామ్స్‌లోనే నమోదు చేయాలన్నారు. ఈ సమీక్షలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్ దిలీప్ చక్రవర్తి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.