Measures to Eradicate Marijuana గంజాయి నిర్మూలనకు చర్యలు
ABN , Publish Date - May 12 , 2026 | 11:58 PM
Measures to Eradicate Marijuana జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు.
బెలగాం, మే12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన గంజాయి కేసులు, వాటి పురోగతిపై చర్చించారు. గంజాయి కేసుల్లో నిందితులను త్వరగతిన అరెస్ట్ చేయాలని, పరారీలో ఉన్న వారి ఆచూకీ కనిపెట్టేందుకు సాంకేతికతను ఉపయోగించాలన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపించాలని సూచించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను, గంజాయిని న్యాయమూర్తుల సమక్షంలో ఇన్వెంటరీ చేయించాలని ఆదేశించారు. నిర్దిష్ట సమ యంలో కోర్టుల్లో అభియోగ పత్రాలు, చార్జి షీట్స్ దాఖలు చేయాలని తెలిపారు. గంజాయి వ్యాపారుల ఆస్తులను జప్తు చేయాలన్నారు. గంజాయి సేవించే వారిని కౌన్సిలింగ్ ఇవ్వాలని, వారి ద్వారా గంజాయి సరఫరా అయ్యే మార్గాలు, మూలాలు కనిపెట్టాలని దిశానిర్దేశం చేశారు. సంకల్పం , చైతన్యం, అభ్యుదయం 2.0 కార్యక్రమాల ద్వారా మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను యువతకు తెలియజేయాలని సూచించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్‌లో పార్వతీపురం ఏఎస్పీ మనీషారెడ్డి, డీఎస్పీ రాంబాబు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ
వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, యువత, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ మాధవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. చెరువు, కుంటలు, కాలువలు, నదుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలన్నారు. ఈత రాని వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తల్లితండ్రులు నిరంతరం వారిపై నిఘా ఉంచాలని సూచించారు.