Share News

మాదక ద్రవ్యాల నిర్మూలనకు చర్యలు

ABN , Publish Date - May 14 , 2026 | 11:59 PM

మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీస్‌ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని, దానిలో భాగంగా గంజాయి సేవించే వారిని నిర్ధారించేందుకు టీహెచ్‌సీ టెస్ట్‌ కిట్లు ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు అందజేస్తున్నామని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు.

     మాదక ద్రవ్యాల నిర్మూలనకు చర్యలు
సీఐకి టీహెచ్‌సీ టెస్ట్‌ కిట్‌ను అందజేస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

- ఎస్పీ మాధవరెడ్డి

- పోలీసులకు టీహెచ్‌సీ టెస్ట్‌ కిట్‌ల అందజేత

బెలగాం, మే 14 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీస్‌ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని, దానిలో భాగంగా గంజాయి సేవించే వారిని నిర్ధారించేందుకు టీహెచ్‌సీ టెస్ట్‌ కిట్లు ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు అందజేస్తున్నామని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో టీహెచ్‌సీ టెస్ట్‌ కిట్‌లను పోలీస్‌ అధికారులకు ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించే వారిని గుర్తించేందుకు ఈ కిట్‌లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కిట్‌లను ఏ విధంగా ఉపయోగించాలి, ఎలా నిర్ధారించుకోవాని అనే అంశాలను పోలీస్‌ అధికారులకు వివరించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం అందరి బాధ్యతని, జిల్లాలో డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్ధాల జోలికి వెళితే కలిగే అనర్ధాలను అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు చైతన్యం కలిగిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి, డీఎస్పీ రాంబాబు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సమస్యలపై అవగాహన అవసరం

సమాజంలో బాల్య వివాహాలు, టీనేజ్‌ ప్రెగ్నెన్సీ, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వంటి సామాజిక సమస్యల నివారణకు అవగాహన అవసరమని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. గురువారం పోలీస్‌ మల్టీ ఫంక్షన్‌ హాల్‌లో సామాజిక సమస్యలపై ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గ ఆధ్వర్యంలో పోలీసులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీడీ కనకదుర్గ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు నివారణకు, బాలల హక్కుల పరిరక్షణకు పలు చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని, ఈ వివాహాలతో బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్‌పై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించారు. ఇటువంటి సామాజిక అంశాలపై ప్రజలకు, యువతకు అర్ధమయ్యేలా వివరించేందుకు ఇరు శాఖలు సమన్వయంతో పని చేయాలని కోరారు.

Updated Date - May 14 , 2026 | 11:59 PM