Industrial Development పారిశ్రామికాభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:21 AM
Measures for Industrial Development జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామిక వేత్త’ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సరికొత్త పారిశ్రామిక విప్తవానికి నాంది పలుకుతున్నట్లు చెప్పారు.
పార్వతీపురం/ పార్వతీపురం టౌన్, జూన్1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామిక వేత్త’ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సరికొత్త పారిశ్రామిక విప్తవానికి నాంది పలుకుతున్నట్లు చెప్పారు. కొత్తగా వ్యాపారాలు లేదా సూక్ష్మ, మధ్య చిన్నతరహ పరిశ్రమలు స్థాపించాలనుకునే నిరుద్యోగులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని సహాయ సహకరాలు పొందొచ్చన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థతో పాటు మెప్మా, పరిశ్రమలశాఖలతో పాటు ఇతర అనుబంధ సంస్థల సమన్వయంతో ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. పీఎం ఉపాధి కల్పన పథకం కింద ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు పొందొచ్చన్నారు. పట్టణ ప్రాంతాల వారికి 25 శాతం, గ్రామీణ ప్రాంతాల వారికి 35 శాతం సబ్బిడీ లభిస్తుందని స్పష్టం చేశారు. ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త’ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి కుటుంబం నుంచి ఒకరు విజయవంతమైన పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దమే లక్ష్యంగా, జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఈ వినూత్న కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్‌కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో కె.హేమలత, తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’లో దేశంలోనే మన్యం అగ్రస్థానం
ఉపాధి హామీ పథకం అమలులో మన్యం జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించిందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎండలు మండుతున్నప్పటికీ జిల్లాలోని చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత ప్రగతికి కారణమైన ఉపాధి అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. దేవాలయాల పరిసరాల్లో వ్యర్థాలు, ప్లాస్టిక్, పాలిథిన్ సంచులు లేకుండా చూడాలని, వాటిని పూర్తిగా నిషేధించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఉపకలెక్టర్ ఎన్.దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాల బలోపేతానికే సూపర్ నారీ యాప్
సీతానగరం (బలిజిపేట), జూన్ 1(ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల బలోపేతానికే ప్రభుత్వం సూపర్ నారీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన డబ్బులు - మన లెక్కలు’ కార్యక్రమంపై సోమవారం వెంగాపురం గ్రామంలో ర్యాలీ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ నారీ యాప్ ద్వారా వ్యక్తిగత పొదుపు, అప్పులు, చెల్లింపుల వివరాలతో పాటు సంఘ సభ్యుల పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకో వచ్చన్నారు. ఇందులో ఆరోగ్య మిత్ర సేవలను ప్రభుత్వం అదనంగా చేర్చిందన్నారు. న్యాయ మిత్ర ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తుల వివరాలు ఈ యాప్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. బ్యాంక్ లింకేజీలు, స్త్రీ నిధి రుణాలు , అంతర్గత పొదుపు వివరాలను డిజిటలైజ్ చేస్తూ.. సూపర్ నారీ యాప్ వినియోగంపై వీవోఏలు, మండల మహిళా సంఘాల పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, ఏపీడీ జయశ్రీ, డీపీఎం రామ్మోహన్, ఏపీఎం రామకృష్ణ, సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.