Share News

‘మెరుగైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు’

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:20 AM

జిల్లాలో మెరుగైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు చేపడు తున్నామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ పి.త్రినాథరావు అన్నారు.

‘మెరుగైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు’
నాగూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఎస్‌ఈ త్రినాథరావు

గరుగుబిల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మెరుగైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు చేపడు తున్నామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ పి.త్రినాథరావు అన్నారు. గురువారం నాగూరు సబ్‌స్టేషన్‌ పరిధిలో 11 కేవీ బ్రేకర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యానికై ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ వైర్లు, స్తంభాలు వంటి నిర్వహణ చర్యలు చేపడుతున్నామన్నారు. గతంలో పలు సర్వీస్‌లు మూకుమ్మడిగా ఉండేవన్నారు. దీంతో లోవోల్టేజీ సమస్య ఉండేదన్నారు. ప్రస్తుతం సబ్‌స్టేషన్ల పరిధిలో వ్యవసాయ కనెక్షన్లు, పరిశ్రమలు, గృహ వినియోగానికి సంబంధించిన కనెక్షన్లు వేర్వేరు చేస్తున్నా మన్నారు. గతంలో కంటే అధికంగా గ్రామాల్లో విద్యుత్‌ వినియోగం పెరిగిం దన్నారు. ఒక్కొక్క ఫీడర్‌ నిర్వహణకు సుమారు రూ. 60 లక్షలు వ్యయంతో పలు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాగూరుకు సంబంధించి 15 కిలోమీటర్ల పరిధిలో నూతనంగా 63 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 6, 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 11 ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామాలకు సరఫరా ఇబ్బందులు తప్పనున్నాయన్నారు. కార్యక్రమంలో ఈఈలు ఆర్‌.రామునాయుడు, వి.రంగారావు, డీఈఈలు డి.పురుషోత్తం, ఆర్‌.ఈశ్వరరావు, ఏఈ బి.శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:20 AM