Share News

May the negotiations be successful.. చర్చలు సఫలమవ్వాలని..

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:57 PM

May the negotiations be successful.. జిందాల్‌ భూ సమస్యలపై కీలక చర్చలకు సమయం ఆసన్నమైంది. నిర్వాసితులు, యాజమాన్యంతో సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత చర్చలు జరపనున్నారు.

May the negotiations be successful.. చర్చలు సఫలమవ్వాలని..
జిందాల్‌ భూములు

చర్చలు సఫలమవ్వాలని..

ఎదురుచూస్తున్న జిందాల్‌ భూ నిర్వాసితులు

ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం ఆశపడుతున్న నిరుద్యోగులు

నేడు కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి మంత్రి అనిత అధ్యక్షతన సమావేశం

జిందాల్‌ భూ సమస్యలపై కీలక చర్చలకు సమయం ఆసన్నమైంది. నిర్వాసితులు, యాజమాన్యంతో సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత చర్చలు జరపనున్నారు. ఈ దఫా స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కూడా హాజరవుతున్నారు. భూ నిర్వాసిత రైతుల వైపు నుంచి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జెఎస్‌బ్ల్యూ ఇండస్ట్రీయల్‌ పార్కు తరఫున వైస్‌ ప్రెసిడెంట్‌ రాచూరి కనకారావు పాల్గోనున్నారు. దీంతో తమ డిమాండ్లకు పరిష్కారం దొరుకుతుందని నిర్వాసితులు, ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని నిరుద్యోగ యువత ఆశపడుతున్నారు.

శృంగవరపుకోట, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి):

జిందాల్‌ మెగా ఇండస్ట్రీయల్‌ పార్కు భూమి పూజకు ఏర్పాట్లు చేయాలని వారం రోజుల క్రితం రాష్ట్ర పరిశ్రమల సెక్రటరీ యువరాజ్‌... కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి, జెసీ సేతు మాధవన్‌కు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఎండీ దినేష్‌కుమార్‌ శనివారం జిందాల్‌ భూముల్లో పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇలా ఆ భూముల్లో ఇండస్ట్రీయల్‌ పార్కుల స్థాపనకు ప్రభుత్వం నుంచి సానుకూల సాంకేతికాలు వస్తుండడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న వంగలపూడి అనిత భూ నిర్వాసితుల సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే గత నెలలో విశాఖలో ప్రాథమికంగా ఇరు వర్గాలతో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేంచేందుకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిస్థితిలో జిల్లాలో జిందాల్‌ యాజమాన్యం వద్ద ఉన్న దాదాపు 1127.76 ఎకరాల భూముల్లో ఇండస్ట్రీయల్‌ పార్కుల నిర్మాణానికి ఆసక్తి చూపింది. మరోవైపు జిందాల్‌ యాజమాన్యం 2023 నవంబర్‌లోనే ఇండస్ట్రీయల్‌, కామర్స్‌ డిపార్ట్‌మెంటు నుంచి అనుమతులు పొందింది. దీంతో ఈ భూముల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్మాణంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం యోచించింది.

అయితే 18 సంవత్సరాల క్రితం జరిగిన భూ సేకరణ సమయంలో జిందాల్‌ యాజమాన్యం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని భూములిచ్చిన రైతులు ఏడాది క్రితం నుంచి రోడ్డెక్కారు. అప్పటి నుంచి వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించారు. పలు డిమాండ్లును ప్రభుత్వం ముందుంచుతున్నారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ గోడు విన్నవిస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిన తరువాతే ఇండస్ట్రీయల్‌ పార్కులకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసిత రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు అనుగుణంగా హోంమంత్రి సోమవారం చర్చలు జరపనున్నారు. అవి సఫలీకృతమైతే నిర్వాసిత రైతులతో పాటు నిరుద్యోగ యువతకూ న్యాయం జరగనుంది.

Updated Date - Jun 07 , 2026 | 11:57 PM