Tourism Development పర్యాటకాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:21 PM
Master Plan for Tourism Development జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం కల్లటి గ్రామంలోని జలపాతాన్ని పరిశీలించారు. కాసేపు స్థానిక గిరిజనులు, అధికారులతో మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా స్థానికులకు ఉపాధి మార్గాలు పెంపొం దించొచ్చని ఆయన తెలిపారు.
గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం కల్లటి గ్రామంలోని జలపాతాన్ని పరిశీలించారు. కాసేపు స్థానిక గిరిజనులు, అధికారులతో మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా స్థానికులకు ఉపాధి మార్గాలు పెంపొం దించొచ్చని ఆయన తెలిపారు. పర్యాటకుల రవాణా సౌకర్యార్థం ఆసక్తి ఉన్న స్థానిక యువతకు ఎలక్ర్టిక్ ఆటోలు, బైక్‌ల కొనుగోలుకు రుణాలు ఇప్పిస్తామని స్పష్టం చేశారు. గుమ్మలక్ష్మీపురంలో ఒక పాయింట్ ఏర్పాటు చేసి వాహనాలను అద్దెకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. జలపాతం, గుహలు సందర్శించేందుకు వచ్చే వారికి గైడ్‌లుగా వ్యవహరించేందుకు గాను యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని వెల్లడించారు. వెబ్‌సైట్ ద్వారా గైడ్‌ల బుకింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కందికొత్తలు వంటి స్థానిక గిరిజన ఆహార పదార్థాలను పర్యాటకులకు అందించేలా మహిళలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా, గుగూల్ మ్యాప్స్‌లో సులభంగా కనిపించేలా జలపాతానికి ఆకర్షణీయమైన పేర్లు ఖరారు చేస్తామని చెప్పారు. వినోదం కోసం ఉయ్యాలలు, రాత్రి బస కోసం క్యాంపింగ్ ప్రదేశాలు, సురక్షితమైన నీటి వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పరిశీలనలో ఐటీడీఏ పీవో వైశాలి, పాలకొడ సబ్ కలెక్టర్ జగన్నాథ్ తదితరులు ఉన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఎల్విన్‌పేట జంక్షన్ పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాపారులతో మాట్లాడి ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా చెత్త డబ్బా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓ మెడికల్ షాపు పరిశుభ్రంగా లేకపోవడం, అవసరమైన పత్రాలు, లైసెన్స్‌దారుడు అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ మండిపడ్డారు. ధ్రువపత్రాలను భద్రగిరి తహసీల్దార్‌కు చూపించే వరకు దుకాణాన్ని మూసివేయాలని ఆదేశించారు.