Share News

చివరిరోజు భారీగా!

ABN , Publish Date - Oct 18 , 2026 | 11:53 PM

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ముగిసింది. మూడు రోజుల పాటు అధికారులు నామినేషన్లు స్వీకరించారు

 చివరిరోజు భారీగా!
విజయనగరం మేయర్‌ అభ్యర్థి అవనాపు భార్గవితో కలిసి నామినేషన్‌ వేసేందుకు వస్తున్న మంత్రి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి

- ముగిసిన నామినేషన్ల స్వీకరణ

- కొన్నిచోట్ల రెబల్స్‌ బెడద..

- నేడు పరిశీలన

-21 వరకూ ఉపసంహరణకు గడువు

విజయనగరం, కలెక్టరేట్‌ అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ముగిసింది. మూడు రోజుల పాటు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. విజయనగరం కార్పొరేషన్‌ మేయర్‌ స్థానానికి టీడీపీ నుంచి ఆవనాపు భార్గవి నామినేషన్‌ దాఖలు చేశారు. మొత్తంగా ఇక్కడ మేయర్‌ స్థానానికి 31, వార్డు సభ్యులకు 450 నామినేషన్లు వచ్చాయి. బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించి అన్ని పార్టీల నుంచి 190 మంది, నెల్లిమర్ల నగరపంచాయతీలో 152 మంది నామినేషన్లు వేశారు. సోమవారం వాటిని పరిశీలిస్తారు. 21 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

బొబ్బిలిలో..

బొబ్బిలి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపాలిటీలో మొత్తం 190 మంది అభ్యర్థులు కౌన్సిలర్‌ పదవులకు నామినేషన్లు వేశారు. ఆఖరి రోజున 101 నామినేషన్లు వచ్చాయి. చైర్‌పర్సన్‌ పదవికి మొత్తం ఆరుగురు నామినేషన్‌లు వేశారు. కౌన్సిలర్‌కు సంబంధించి టీడీపీ తరఫున 70, వైసీపీ నుంచి 74, ఇండిపెండెంట్లగా 23, జనసేన నుంచి 15, కాంగ్రెస్‌ నుంచి 3, బీజేపీ నుంచి 3, సీపీఎం, బీఎస్‌పీల నుంచి చెరొకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

రెండు పార్టీలకు తప్పని రెబల్స్‌..

బొబ్బిలి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. టీడీపీ నుంచి 70 మంది, వైసీపీ నుంచి 74 మంది నామినేషన్లు వేశారంటే రెబల్‌ అభ్యర్థుల బెడద ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నామినేషన్లలో కొన్ని డమ్మీ కూడా ఉన్నాయి. జనసేనకు నాలుగైదు సీట్లు మాత్రమే కేటాయించినప్పటికీ ఆ పార్టీ నుంచి 15 మంది నామినేషన్లు వేయడం గమనార్హం. టీడీపీ-జనసేన మధ్య టికెట్ల సర్దుబాటు వ్యవహారం బెడిసికొట్టింది.

ఆఖరి నిమిషంలో అభ్యర్థుల పేర్లు తారుమారు...

పలు వార్డుల్లో ఆఖరి నిమిషంలో పోటీ చేసే వారి పేర్లు తారుమారయ్యాయి. 25వ వార్డు నుంచి బీజేపీ నేత మరిశర్ల రామారావునాయుడు పేరు ఆకస్మికంగా తెరమీదకు వచ్చింది. ఆ వెంటనే ఒక్కరోజులోనే ఆయనను 24వ వార్డుకు మార్చారు. ఈ వార్డు నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు విస్తృత ప్రచారం చేసుకున్న పీఆర్‌టీయూ మాజీ నేత వాలేటి తవిటినాయుడుకు చుక్కె దురైంది. 18వ వార్డులో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కింతలి గీతాలక్ష్మికి అధిష్ఠానం సడన్‌గా టికెట్‌ను డిక్లేర్‌ చేసింది. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ సీనియర్‌ కార్యకర్త కొలుసు వెంకన్న తన భార్య రామలక్ష్మిని 18వ వార్డులో బరిలోకి దించి ఆదివారం నామినేషన్‌ వేయించారు. 25 వార్డు నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 26 వార్డు నుంచి మొత్తం 8 మంది నామినేషన్లు వేయగా, వారిలో టీడీపీ వారు ఐదుగురు ఉన్నారు. ఇలా అనేక వార్డుల్లో ఈ పరిస్ధితి నెలకొంది.

నెల్లిమర్లలో 152 నామినేషన్లు..

నెల్లిమర్ల, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ఆదివారం వివిధ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ల నుంచి 75 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్‌ పదవికి ఏడుగురు, కౌన్సిలర్‌ అభ్యర్థులుగా 68మంది నామినేషన్లు వేశారు. వైసీపీ చైర్మన్‌ అభ్యర్థి సముద్రపు రామారావు, ఆయన సతీమణి సముద్రపు రమణమ్మతోపాటు వైసీపీ అభ్యర్థి మొయిద శ్రీనివాసరావు, ఆయన తనయుడు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి కనకన పద్మనాథం, బీజేపీ తరఫున మైపాడ ప్రసాద్‌ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. మూడు రోజులు కలిపి మొత్తంగా 152 నామినేషన్లు వచ్చాయి. ఇందులో చైర్మన్‌ స్థానానికి 13, కౌన్సిలర్ల స్థానాలకు 139 నామినేషన్లు దాఖలయ్యాయి. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుడి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌), బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ, రాష్ట్ర నాయకులు రెడ్డి పావని, బూర్లె శ్రీధర్‌, నాయకులు ఆల్తి నల్లిబాబు, చందక గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

చైర్మన్‌ ప్రధాన అభ్యర్థులు వీరే...

నెల్లిమర్ల మున్సిపాలిటీలో చైర్మన్‌ అభ్యర్థులుగా మొత్తం 13 మంది నామినేషన్లు సమర్పించారు. వారిలో ఏడుగురు ప్రధాన అభ్యర్థులుకాగా, మిగిలిన ఆరుగురు వారికి మద్దతుగా నామినేషన్లు వేశారు. మైపాడ ప్రసాద్‌ ఎన్డీయే కూటమి, లెంక అప్పలనాయుడు టీడీపీ, సముద్రపు రామారావు వైసీపీ, మొయిద శ్రీనివాసరావు వైసీపీ, రవ్వా నాగేంద్రవర్మ జనసేన, జనా వెంకట త్రివేణి ప్రసాద్‌ జనసేన, కనకల పద్మనాభం కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేశారు.

Updated Date - Oct 18 , 2026 | 11:53 PM