Massive explosion in the berry industry బెర్రీ పరిశ్రమలో భారీ పేలుడు
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:46 PM
Massive explosion in the berry industry బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్ సెంటరులోని బెర్రీ పరిశ్రమలో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫెర్రో మాంగనీస్ మెటల్ గెలాక్సియన్.. ట్యాంకు(స్లాగ్)లో పడటంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.
బెర్రీ పరిశ్రమలో భారీ పేలుడు
ఎగసిపడిన మంటలు.. ఇద్దరికి గాయాలు
లారీ కిందపడి క్లీనర్ కాలు నుజ్జునుజ్జు..
ఐదు నిమిషాలపాటు భారీ శబ్దం
ఘటనపై సమగ్ర దర్యాప్తు: ఆర్డీవో
బొబ్బిలి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్ సెంటరులోని బెర్రీ పరిశ్రమలో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫెర్రో మాంగనీస్ మెటల్ గెలాక్సియన్.. ట్యాంకు(స్లాగ్)లో పడటంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ట్యాంకు నుంచి ఎగిసిన నిప్పురవ్వలు సమీపంలోని గోదాములో ఉన్న లైమ్‌స్టోన్ బస్తాలపై పడటంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ఘటనతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
- ప్రమాద సమయంలో ముడిసరుకుతో వచ్చిన లారీలను బయటకు తీసుకెళ్లే ప్రయత్నంలో లారీ కిందపడి క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. గుర్ల మండలం లవిడాం గ్రామానికి చెందిన గండ్రేటి సూర్యారావు ఎడమ కాలిపై నుంచి లారీ వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయింది. అతడికి స్థానిక సీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించారు. నిప్పురవ్వలు ఎగిసిపడి ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
- ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే బేబీనాయన, ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు, డీఎస్పీ రాకోటి గోవిందరావు, తహసీల్దార్ సుబ్బారావు, సీఐ కింతలి నారాయణరావు తదితరులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కార్మికులను అడిగి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. బొబ్బిలి, సాలూరు, గజపతినగరం, డొంకినవలస ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఐదు నిమిషాలపాటు భారీ శబ్దం: ఆర్డీవో
గ్రోత్ సెంటరులోనే తమ కార్యాలయం ఉందని ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు తెలిపారు. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళుతుండగా పరిశ్రమ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించిందన్నారు. ఐదు నిమిషాలపాటు శబ్దం వినిపించిందని, భారీగా మంటలు వ్యాపించాయని తెలిపారు. వెంటనే తహసీల్దార్, డీటీ, ఆర్‌ఐలను ఘటనాస్థలానికి పంపించి వివరాలు తెలుసుకున్నామని చెప్పారు. చుట్టుపక్కల అగ్నిమాపక కేంద్రాల నుంచి వాహనాలను రప్పించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదంలో కార్మికులు ఎవరూ గాయపడలేదని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోందని, అయితే దీనిపై పూర్తిస్థాయిలో నిర్ధారణ కావాల్సి ఉందని అన్నారు. పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గతంలో పలుమార్లు హెచ్చరించామని తెలిపారు. సేఫ్టీ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని చెప్పారు.
ఈ ప్రమాదాలకు అంతేలేదా?: సీపీఎం
గ్రోత్ సెంటరు పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా భద్రతా చర్యలు తీసుకోవడం లేదని సీపీఎం నేత పి.శంకరరావు ఆరోపించారు. ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగడంతోపాటు పలువురు గాయపడుతున్నారని, కార్మికులకు కనీస భద్రత కరువైందన్నారు. మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదం నాలుగైదు కిలోమీటర్ల దూరం వరకు భయానకంగా కనిపించిందన్నారు. యాజమాన్యం ప్రమాదాలను తేలిగ్గా తీసుకుంటోందని విమర్శించారు. ఘటనపై పోలీసులు, అధికారులు లోతుగా విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.