Kolatam Performance 6వేల మందితో 22న భారీ కోలాటం ప్రదర్శన
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:48 PM
Mass Kolatam Performance on 22nd with 6,000 Participants గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఈ నెల 22న భారీ స్థాయిలో కోలాటం ప్రదర్శనను నిర్వహించనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
పార్వతీపురం/సాలూరు, ఏప్రిల్7(ఆంధ్రజ్యోతి): గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఈ నెల 22న భారీ స్థాయిలో కోలాటం ప్రదర్శనను నిర్వహించనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాలూరు డంపింగ్ యార్డు వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనలో సుమారు ఆరువేల మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యార్థులు 108 నిమిషాలపాటు సూర్య నమస్కారాలు చేసిన స్ఫూర్తితో ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఇందులో భాగస్వాములవుతారని వెల్లడించారు.ఆసక్తి ఉన్న వారు ఐటీడీఏ కార్యాలయం లేదా కలెక్టరేట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులకు అవసరమైతే నిపుణులతో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపే ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఈ వినూత్న ప్రదర్శనపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. అరుదైన రికార్డుకు జిల్లా కేంద్రం వేదిక కావాలన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించడమే లక్ష్యంగా ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని కలెక్టర్ చెప్పారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి టౌన్ పోలీస్‌స్టేషన్ వరకు సుమారు కిలోమీటరు మేర ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
మెనూ అమలు చేయకుంటే కఠిన చర్యలు: కలెక్టర్
సాలూరు, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో సక్రమంగా మెనూ అమలు చేయకుండా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సాలూరు పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్‌ను ప్రత్యేకాధికారి యశ్వంత్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందించే ఆహారం పోషకవిలువలతో రుచికరంగా ఉండాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడరాదని తెలిపారు. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులు, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలోని సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, ముస్తాబు కార్యక్రమ పురోగతిని స్వయంగా పరిశీలించారు. వంటశాలను సందర్శించి భోజనం తయారీ, వస్తువుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందో లేదో ఆరా తీశారు. స్మార్ట్ బోర్డుల ద్వారా బోధించే విధానాన్ని పరిశీలించి పలువురు విద్యార్థులను ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణత లక్ష్యం కావాలని దిశానిర్దేశం చేశారు.