Sri Ram Navami: కల్యాణం.. కమనీయం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:28 AM
Sri Ram Navami: శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం రామతీర్థం దేవస్థానంలో సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
- కన్నుల పండుగగా సీతారాముల వివాహం
- రామనామస్మరణతో మార్మోగినరామతీర్థం
- ఉత్తరాంధ్ర నుంచి తరలివచ్చిన భక్తజనం
- పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీనివాస్
నెల్లిమర్ల, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం రామతీర్థం దేవస్థానంలో సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రామతీర్థం దేవస్థానం పరిసరాలు రామనామస్మరణతో మార్మోగాయి. రాములోరి పెళ్లి ఘట్టాన్ని వేలాది మంది భక్తులు తిలకించారు. శుక్రవారం వేకువజామున 3 గంటలకు స్వామివారికి ఆరాధన, బాలభోగం, తీర్థగోష్టి, ఉదయం 6.30కు అవతార సర్గ విన్నపం, 7.30కు పాలు, పెరుగు, తేనె, జలాలతో అష్టకలశ స్నపన మహోత్సవం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, పవన్, కిరణ్‌కుమార్ రామతీర్థం గుడిలో ఉన్న ఉత్సవమూర్తులను ఊరేగింపుగా నీలాచం కొండ పక్కన ఉన్న కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. 11.40 గంటల సమయంలో జీలకర్ర, బెల్లం కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో మాంగళ్యధారణ చేపట్టారు. అనంతరం స్వామివారి తలంబ్రాల సేవను వేదపండితులు జరిపించారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు పెళ్లి తంతు జరిగింది. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు. కల్యాణ ఘటాన్ని హైగ్రీవాచా ర్యులు చదివారు. ఈవో వై.శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి..
ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రసాద్ దంపతులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఝాన్సీలక్ష్మి దంపతులు కూడా పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అలాగే సింహాచలం దేవస్థానం నుంచి కూడా పట్టువస్త్రాలు రామతీర్థానికి చేరుకున్నాయి. ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు (సురేష్‌బాబు), ఎస్పీ దామోదర్, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, విశాఖ నార్త్ పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, కూటమి నాయకులు కంది శేఖర్, గేదెల రాజారావు, చనమల్లు వెంకటరావు, ఆల్తి శ్రీనివాసరావు తదితరులు స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో, డీఎస్పీ గోవిందరావు పర్యవేక్షణలో సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ గణేష్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
గోటితో వలిచిన తలంబ్రాలు..
గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను కల్యాణానికి ఉపయోగించారు. కొంతమంది భక్తులు తలంబ్రాలపై జైశ్రీరామ్ అనే అక్షరాలు రాసి అందజేశారు. మండపేట నుంచి తెప్పించిన కొబ్బరి బొండాలపై సీతాసమేత రామలక్ష్మణుల అక్షరాలను సుందరంగా తీర్చిదిద్ది సమర్పించారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలను ఆలయ అధికారులు పంపిణీ చేశారు. పానకం కూడా అందజేశారు. దేవాలయం పక్కన అన్నదానం నిర్వహించారు. ఎక్కడికక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.