‘మారిషన్’ సక్సెస్
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:43 PM
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని రెండు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన మారిషన్ పైనాపిల్ సాగు సక్సెస్ అయింది.
- అధిక దిగుబడి వస్తున్న కేరళ రకానికి చెందిన పైనాపిల్
- రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్న పంట
- ఒక్కో పండు ధర రూ.25పైనే
- మరో వెయ్యి ఎకరాల్లో సాగుకు ప్రతిపాదనలు
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని రెండు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన మారిషన్ పైనాపిల్ సాగు సక్సెస్ అయింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ పైనాపిల్ రకాన్ని ఐటీడీఏ అధికారులు రెండేళ్ల కిందట స్థానిక రైతులకు పరిచయం చేశారు. పంట దిగుబడులు, ఆదాయం రెండూ అధికంగా ఉంటున్నాయి. పండు సైజు పెద్దగా ఉండడంతో పాటు రుచి కూడా బాగుంటుండడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. మిగతా మండలాల్లో కూడా సాగును విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వెయ్యి ఎకరాల్లో మారిషన్ పైనాపిల్ మొక్కలను నాటించేందుకు సిద్ధమవుతున్నారు.
సీతంపేట రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని సీతంపేట, భామిని మండలాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న మారిషన్ పైనాపిల్ (కేరళ రకం) రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. రెండేళ్ల కిందట ఈ రెండు మండలాల్లో 7.20లక్షల మారిషన్ పైనాపిల్ మొక్కలను రైతులకు అధికారులు పంపిణీ చేశారు. సుమారు 74 ఎకరాల్లో ఈ మొక్కలను నాటారు. 12 నుంచి 15 నెలల మధ్యలో పంట చేతికందడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండు సైజు, రుచి బాగుండడంతో డిమాండ్ నెలకొంది. మైదాన ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో వ్యాపారులు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు. ఒక పండు ధర రూ.25 పలుకుతోంది. రైతులకు అడ్వాన్స్‌లు చెల్లిస్తున్నారంటే పంటకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఐటీడీఏ పరిధిలోని పలు మండలాలకు చెందిన రైతులు ఈ పంటను వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతర పంటల్లో భాగంగా సబ్సిడీపై మారిషన్ పైనాపిల్ మొక్కలను పంపిణీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహించేందుకు చర్యలు ప్రారంభించింది. ఆ మొక్కలను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఆ రెండు రకాలతో నష్టాలు..
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 20 సబ్‌ప్లాన్ మండలాల్లో ఇప్పటి వరకు సింహాచలం రకానికి చెందిన పైనాపిల్‌ను 7,322ఎకరాల్లో, క్యూ వెరైటీకు చెందిన పైనాపిల్‌ను 300 ఎకరాల్లో గిరిజన రైతులు పండిస్తున్నారు. ఈ రెండు రకాలకు చెందిన పైనాపిల్ పండ్ల ధర సైజును బట్టీ రూ.15నుంచి రూ.16వరకు మాత్రమే పలుకుతోంది. సైజు చిన్నగా ఉండడంతో పాటు రుచిలో కూడా చిన్న పులుపు ఉండడంతో ఈ పండ్లకు అంతగా డిమాండ్ ఉండడం లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించపోతే కనీస మద్దతు ధర కూడా లభించదు. లాభాల మాట అటు ఉంచితే కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మారిషన్ పైనాపిల్ సాగుకు మొగ్గు చూపుతున్నారు.
మంచి ఆదాయం వస్తుంది..
నేను గతంలో సింహాచలం రకానికి చెందిన పైనాపిల్‌ను పండించాను. ఈ పండు చిన్న సైజ్‌లో ఉండడంతో మద్దతు ధర అంతగా లభించేది కాదు. దీంతో అధికారుల ప్రోత్సాహంతో మారిషస్ పైనాపిల్‌ను సాగు చేయడం ప్రారంభించాను. సైజు పెద్దదిగా ఉండడంతో ఒక్కో పండు ధర రూ.25వరకు పలుకుతుంది. మంచి ఆదాయం వస్తుంది.
-సవర రాజయ్య, గుడ్డిమీదగూడ, సీతంపేట
మార్కెట్‌లో మంచి గిరాకీ
నేను మారిషస్ పైనాపిల్‌ను సాగు చేస్తున్నా. ఈ ఏడాది కొంతవరకు దిగుబడి వచ్చింది. రానున్న కాలంలో మరింత దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మారిషస్ రకానికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ఎక్కువ మొత్తం అమ్ముడుపోతున్నాయి. వీటి ధరతో పోల్చుకుంటే సింహాచలం, క్యూ రకాలకు చెందిన పండ్ల ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కనీస మద్దతు ధర కూడా రావడం లేదు.
-సవర రుగ్గయ్య, రుక్మిణిగూడ, సీతంపేట
వెయ్యి ఎకరాల్లో వేసేందుకు ప్రతిపాదనలు
సీతంపేట, భామిని మండలాల్లో ఇప్పటికే కేరళ రకానికి చెందిన మారిషస్ పైనాపిల్ పంటకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఐటీడీఏ పరిధిలోని మిగిలిన 18 మండలాల్లో ఈపంటను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాం. వెయ్యి ఎకరాల్లో వెయ్యి మంది రైతులకు మారిషస్ రకానికి చెందిన పైనాపిల్ సక్కర్స్(మొక్కలు)పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అనుమతులు వచ్చిన వెంటనే మొక్కలు పంపిణి చేస్తాం.
-ఎస్‌వీ గణేష్, పీహెచ్‌వో