Share News

Marijuana export through car కారు మాటున గంజాయి

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:17 AM

Marijuana export through car గంజాయి రవాణాదారుల కొత్త వ్యూహం బెడిసికొట్టింది. కంటైనర్‌లో కారు తరలిస్తున్నట్లు నమ్మబలుకుతూ హర్యానా నుంచి జిల్లాకు రాగలిగారు. గోవిందపురం వద్ద కారు దించి అందులోని గంజాయిని వేరే మార్గంలో తరలించాలనుకున్నారు. వారి ప్రణాళికను పక్కాగా తెలుసుకున్న పోలీసులు గంజాయి మార్పిడి జరుగుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Marijuana export through car కారు మాటున గంజాయి
పట్టుకొన్న గంజాయితో పోలీసులు

కారు మాటున గంజాయి

కంటైనర్‌లో తరలిస్తూ దొరికిన వైనం

82 కిలోలు సీజ్‌.. ముగ్గురు అరెస్టు

పూసపాటిరేగ, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణాదారుల కొత్త వ్యూహం బెడిసికొట్టింది. కంటైనర్‌లో కారు తరలిస్తున్నట్లు నమ్మబలుకుతూ హర్యానా నుంచి జిల్లాకు రాగలిగారు. గోవిందపురం వద్ద కారు దించి అందులోని గంజాయిని వేరే మార్గంలో తరలించాలనుకున్నారు. వారి ప్రణాళికను పక్కాగా తెలుసుకున్న పోలీసులు గంజాయి మార్పిడి జరుగుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం షామిలి జిల్లాకు చెందిన కంటైనర్‌ డ్రైవర్‌ అక్రమ్‌, అదే రాష్ట్రానికి చెందిన రాహుల్‌ కుమార్‌లు హర్యానా నుంచి గంజాయితో బయలుదేరారు. ఒకరు కంటైనర్‌ లారీని నడుపుతుండగా మరొకరు రోడ్డు మార్గంలో ముందు వెళ్తున్నాడు. కంటైనర్‌లో ఓ కారు ఉంచి అందులో 82 కిలోల గంజాయిను దాచారు. ప్రతిచోటా కారును తరలిస్తున్నట్లు పోలీసులకు నమ్మబలికారు. అయితే నార్కోటెక్‌ అధికారులకు గంజాయి రవాణాపై పక్కా సమాచారం ఉండటంతో నిఘా పెట్టారు. కంటైనర్‌ నంబర్‌ను ట్రాక్‌ చేశారు. జీపీఎస్‌ ఆధారంగా వాహనం వెళ్తున్న మార్గాన్ని గుర్తించారు. కాగా ఆదివారం సాయంత్రం డ్రైవర్‌ జాతీయరహదారి నుంచి చింతపల్లి రోడ్డులోకి వాహనాన్ని మళ్లించాడు. గోవిందపురం వద్దనున్న విద్యుత్‌సబ్‌స్టేషన్‌ సమీపానికి చేరగానే వాహనాన్ని నిలిపాడు. ఆపై ఇక్కడి నుంచి గంజాయిని వేరొక కారులో తీసుకెళ్లేందుకు విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన వైద్యుడు మేడబోయిన తులసీదాస్‌ కారులో వచ్చాడు. ఈ ముగ్గురి మధ్య గంజాయి మార్పిడి జరుగుతుండగా ఎస్‌ఐ గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకొన్నారు. అనంతరం 82 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురినీ అరెస్టు చేశారు. కంటైనర్‌, మూడు కార్లు, ఐదుసెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొన్నారు. గంజాయి విలువ సుమారుగా రూ.4లక్షలు పైబడి ఉంటుందని సీఐ రామకృష్ణ తెలిపారు. గంజాయి రవాణాలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:17 AM