“Manyam to Odisha” మన్యం టు ఒడిశా
ABN , Publish Date - May 13 , 2026 | 12:03 AM
“Manyam to Odisha” జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. నదులు, చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి.. ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా రెవెన్యూ, గనుల శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇసుకాసురులు బరి తెగిస్తున్నారు.
జిల్లాలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.3 వేలు.. ఒడిశాలో రూ.7 వేలు
నదులు, చెరువుల్లో తవ్వకాలు
యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుకాసురులు
అధిక ధరలకు విక్రయాలు
అడ్డుకట్టవేయలేకపోతున్న అధికారులు
పార్వతీపురం, మే12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. నదులు, చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి.. ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా రెవెన్యూ, గనుల శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇసుకాసురులు బరి తెగిస్తున్నారు. జిల్లాలో ఇసుకను యథేచ్ఛగా ఒడిశాకు తరలిస్తున్నారు. అక్కడ అధిక ధరలకు విక్రయించి.. లక్షలాది రుపాయలు ఆర్జిస్తున్నారు. మొత్తంగా దీనిపై ప్రశ్నించే వారు లేకపోవడంతో వారి దందా మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.
తవ్వేసి.. తరలించేస్తున్నా...
- భామిని మండలం బత్తిలి వంశధార తీరం నుంచి ఒడిశాకు ఇసుక అక్రమంగా తరలి పోతోంది. ట్రాక్టర్ ఇసుక ధర ఇక్కడ సుమారు రూ.2,500 నుంచి రూ.3వేలు ఉండగా.. ఒడిశాలో మాత్రం రూ.7 వేలు పలుకుతుంది. దీంతో అక్రమార్కులు ఇక్కడ తవ్వకాలు జరిపి.. యథేచ్ఛగా ఒడిశాకు తరలించి విక్రయాలు జరుపుతున్నారు. ఒడిశాలోని రాయగడ జిల్లాలో గొట్లభద్ర, జగన్నాథపురం, సింగ్‌బాయ్‌తో పాటు అనేక ప్రాంతాలకు బత్తిలి నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. మొత్తంగా బత్తిలి తీరం నుంచి రాత్రి, పగలు అని తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నారు. తీర ప్రాంతం, ఊటబావులు, వంతెనల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో ముంపు పొంచి ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా.. కన్నెత్తి చూసే వారు కరువవడంతో ఇసుక దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
- సాలూరు పట్టణంతో పాటు మండలంలోని మామిడిపల్లి, కందులపదం, పాచిపెంట మండలంలో పాంచాలి, కర్రివలస ప్రాంతాల్లోని వేగావతి, ఒట్టిగెడ్డ నదుల వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా నిత్యం ఇసుక తవ్వకాలు జరిపి ఒడిశాకు తరలిస్తున్నారు.
- కొమరాడ మండలంలో పాత కళ్లికోట, దుగ్గి, కూనేరు రామభద్రపురం తదితర ప్రాంతాల్లో నాగావళి తీరంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. జియ్యమ్మవలస తదితర మండలాల నుంచి కూడా అక్రమ రవాణా సాగుతోంది.
- పాలకొండ మండలంలో గోపాలపురం, అన్నవరం, మంగళాపురం గ్రామాల్లోని నాగావళి తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వీరఘట్టం మండలం కడకెల్ల, చిదిమి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
- సీతానగరం మండలంలో బూర్జ, లక్ష్మీపురం, సీతానగరం, తామరఖండి, గెడ్డలుప్పి బలిజిపేట మండలంలో అరసాడ, మొరగడం, చాకరాపల్లి, నారాయణపురం, వంతరాం, పనుకు వలస నుంచి ఇసుక అక్రమ రవాణా ఇష్టారాజ్యంగా సాగుతోంది.
ప్రభుత్వ అవసరాల పేరిట...
ప్రభుత్వ అవసరాల పేరిట సచివాలయ కార్యదర్శుల నుంచి అనుమతి పత్రాలు పొంది కొంతమంది ఇసుకను బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. జిల్లాలో చాలాచోట్ల ట్రాక్టర్ ఇసుకపై రూ.వెయ్యి పెంచి రూ.నాలుగు వేలకు విక్రయిస్తున్నారు. దీంతో గృహ నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. ఉచిత ఇసుక విధానం ఉన్నా.. అధిక ధరకు ఇసుకను కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడ్డొచ్చేవారికి ముడుపులు
ఇసుక దందాకు అడ్డొచ్చేవారికి అక్రమార్కులు ముడుపులు ఇచ్చి అక్రమ రవాణా సాగిస్తున్నారు. భామిని, సాలూరు, పాచిపెంట తదితర మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల మైన్స్ , రెవెన్యూ శాఖాధికారులు మొక్కుబడిగా దాడులు జరిపి మమ అనిపిస్తున్నారు. మరి కొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ ఇసుక ట్రాక్టర్లను విడిపించుకుంటున్నారు. మొత్తంగా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా వెనుక పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి.. ఈ దందాకు అడ్డుకట్టవేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఈ విషయంపై గనులశాఖ ఏడీ రామును వివరణ కోరగా.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాలకొండ నియోజవకర్గంలో అధికారికంగా నాలుగు ఇసుక రీచ్‌లు ఉన్నాయన్నారు. మరో రెండు రీచ్‌లను కొమరాడ మండలంలో ప్రారంభిస్తామని వెల్లడించారు. సిబ్బంది కొరత వేధిస్తున్నా.. ఇసుక అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా పెట్టామని చెప్పారు.