Share News

మన్యం టు ఒడిశా

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:36 PM

జిల్లాలో వంశధార, నాగావళి, గోముఖి, సువర్ణముఖి నదుల్లో ఇసుకను అక్రమార్కులు తోడేస్తున్నారు.

 మన్యం టు ఒడిశా
వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద నాగావళిలో ఇసుక తవ్వకాలు

-నదుల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు

-ట్రాక్టర్లలో పొరుగు రాష్ర్టానికి తరలింపు

-చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

పార్వతీపురం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వంశధార, నాగావళి, గోముఖి, సువర్ణముఖి నదుల్లో ఇసుకను అక్రమార్కులు తోడేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా యంత్రాలతో ఎడాపెడా తవ్వేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడే భారీగా గోతులు ఏర్పడుతున్నాయి. భామిని మండలం బత్తిలిలోని వంశధార తీరం నుంచి ఒడిశా రాష్ట్రం గొట్లభద్ర, జగన్నాథపూర్‌, బాసన్నగూడ తదితర గ్రామాలకు అక్రమంగా ఇసుక తరలిపోతుంది. అలాగే మక్కువ మండలం డి.శిర్లాం, సీతానగరం మండలం లక్ష్మీపురం, బూర్జ, సీతానగరం, బలిజిపేట మండలం నారాయణపురం, వంతరాం, అరాడ, గరుగుబిల్లి మండలం సంతోషపురం పంచాయతీ పిట్టలమెట్ట, వీరఘట్టం మండలం కడకెల్ల ప్రాంతాల్లోని వంశధార, నాగావళి, గోముఖి, సువర్ణముఖి నదుల్లో ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. నదుల్లో అడ్డంగా ప్రత్యేక ర్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. భారీ వాహనాలు కూడా నదుల్లోకి వెళ్లేందుకు వీలుగా రహదారులను నిర్మించి ఒడిశా, విశాఖపట్నం, విజయనగరం తదితర సుదూర ప్రాంతాలకు ఇసుకను రవాణా చేస్తున్నారు. పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. మైనింగ్‌శాఖ అధికారులు కొన్ని నెలల కిందట దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఆ తరువాత పరిస్థితి షరామామూలే అన్నట్లు తయారైంది. రాజకీయ నాయకుల పైరవీలతో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కూటమికి చెందిన ఓ నాయకుని అనుచరులు ఇసుక అక్రమ రవాణాలో కీలక పా త్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలపై నిఘా పెట్టాలని, ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే యంత్రాలు, వాహనాలను సీజ్‌ చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:36 PM