Share News

Manyam అన్ని రంగాల్లో మన్యం అభివృద్ధి చెందాలి

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:13 AM

Manyam Should Progress in All Sectors మన్యం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని.. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్చి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.

Manyam   అన్ని రంగాల్లో  మన్యం అభివృద్ధి చెందాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

పార్వతీపురం, జూన్‌16(ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని.. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్చి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం(డీఆర్‌సీ) నిర్వహించారు. తొలుత వ్యవసాయ శాఖపై సమీక్షించగా.. సీతంపేట గిరిజన ప్రాంతంలో పైనాపిల్‌ సాగు సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని మంత్రి అన్నారు. గత ఏడాది కేరళ నుంచి నాణ్యమైన రకం మారిషస్‌ పైనాపిల్‌ తెప్పించామని, 500 ఎకరాల్లో సాగు చేపట్టగా మంచి ఫలితాలు వచ్చాయని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. ఇక్కడి వాతావరణం , నేలలు ఈ రకానికి అనుకూలించడంతో రైతులకు లబ్ధి చేకూరేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్న ఆదేశించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 1000 ఎకరాల్లో మారిషస్‌ రకం సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సీతంపేట పైనా పిల్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు ఎగుమంతి అవకాశాలను కూడా పరిశీలించాలని ఆదేశించారు. బనానా పౌడర్‌పై దృష్టికేంద్రీకరించాలని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర కోరగా.. దీనిని కూడా పరిశీలించాలని మంత్రి సూచించారు. పిడుగుపాటుకు పలు పశువులు మృతి చెందుతున్నాయని, నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి కోరారు. ఈ అంశంపై వెంటనే నివేదికలను అందించాలని మంత్రి అచ్చెన్న అధికారు లను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా మంజూరైన జలధార, జలహారతి పనులు, వాటి ప్రగతిపై ఆరా తీశారు. పనులు వేగవంతం చేయాలని ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ప్రదీప్‌ను ఆదేశించారు. చెరువులు, కాలువలను ఆక్రమించి, నిర్మాణాలు చేపడుతున్న వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. పార్వతీపురంలోని పలు చెరువుల్లో అక్రమ నిర్మాణాల విషయాన్ని ఎమ్మెల్యే విజయచంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. అయితే ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని పార్వతీపురం మున్సిపల్‌ కమిషనర్‌ పావని వివరించారు. విద్యాశాఖలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, ప్రభుత్వ నిధుల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రతిపైసాకు అధికారులు జవాబుదారీగా ఉండాలన్నారు. కాగా నిబంధనల ప్రకారం యోగా సామాగ్రి కొను గోలు చేశామని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. ఇక తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని పాత రెగ్యులేటర్‌కు చెందిన షట్టర్లు మరమ్మతులకు ప్రత్యేకంగా నిధులు కేటా యిస్తున్నట్టు మంత్రి చెప్పారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్వల్ప అస్వస్థతకు గురవగా, పాల కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అనారోగ్యంతో హాజరుకాకపోవడం వల్ల మరో వారం రోజుల్లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, ఎమ్మెల్యే విజయచంద్ర, ఎమ్మెల్సీలు శ్రీనివాసులునాయుడు, విక్రాంత్‌, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఇన్‌చార్జి జేసీ హేమలత, ఇన్‌చార్జి ఐటీడీఏ పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:13 AM