Manyam 13వ స్థానంలో మన్యం
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:21 AM
Manyam Secures 13th Position రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్య సాధనలో జిల్లా పనితీరు కాస్త పర్వాలేదనిపించింది. మొత్తంగా 13వ స్థానం దక్కించుకుంది. సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల సమీక్షలో ప్రణాళికా విభాగం నివేదిక ఈ విషయాలను స్పష్టం చేసింది.
పార్వతీపురం, జనవరి12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్య సాధనలో జిల్లా పనితీరు కాస్త పర్వాలేదనిపించింది. మొత్తంగా 13వ స్థానం దక్కించుకుంది. సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల సమీక్షలో ప్రణాళికా విభాగం నివేదిక ఈ విషయాలను స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 15 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించాల్సిందేనని.. శతశాతం లక్ష్యాలు చేరుకోవాలని సీఎం చంద్ర బాబు అధికారులకు స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కాగా గృహ నిర్మాణాలకు సంబంధించి జిల్లా మూడో స్థానంలో ఉంది. రెవెన్యూ సర్వీసులు, ప్రభుత్వాసుపత్రి సేవల్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ట్రాన్స్‌పోర్ట్ (ట్యాక్స్)లో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. పాస్‌పుస్తకాల జారీ, రిజిస్ర్టేషన్ సర్వీసుల్లో 8వ స్థానం దక్కించుకుంది. ఇరిగేషన్‌శాఖ పనితీరులో జిల్లాకు పదో స్థానం లభించింది. దీపం పథకం, ఆర్టీసీ సేవలు, బస్‌స్టేషన్ల నిర్వహణ, నిత్యాసవసర సరుకులు పంపిణీ, పంచాయతీ సర్వీసెస్, అన్నక్యాంటీన్ల నిర్వహణ, దేవాలయాల్లో సదుపాయాలు, విద్యుత్ తదితర సేవల్లో మొదటి పది స్థానాల్లో మన్యం నిలవలేదు. మొత్తంగా జిల్లా పనితీరుపై 67.6 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారు. 32.4శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. వారికి మెరుగైన సేవలు అందించాల్సి ఉంది.