Tribal Welfare గిరిజన సంక్షేమంలో మన్యం ముందంజ
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:53 PM
Manyam Leads the Way in Tribal Welfare అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రగతి, పథకాలు అమలు, అభిృద్ధి పనుల తీరును నివేదికల ఆధారంగా వెల్లడించారు. కొన్ని రంగాలు, పథకాల అమలులో మన్యం ముందంజలో ఉంటే, మరికొన్ని భౌతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో వెనుకబడి ఉన్నట్టు తేలింది.
ప్లాంటేషన్, వర్షపు నీటి నిల్వ, ఇంకుడు గుంతలు,
సోలార్ ఏర్పాటులో వెనుకంజ
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి
పార్వతీపురం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రగతి, పథకాలు అమలు, అభిృద్ధి పనుల తీరును నివేదికల ఆధారంగా వెల్లడించారు. కొన్ని రంగాలు, పథకాల అమలులో మన్యం ముందంజలో ఉంటే, మరికొన్ని భౌతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో వెనుకబడి ఉన్నట్టు తేలింది. స్ర్తీశక్తి పథకం అమలు, గిరిజన సంక్షేమం, ఉద్యాన పంటల విస్తరణ, డ్వాక్రా సంఘాలకు రుణాలు తదితర వాటిల్లో జిల్లా మెరుగైన పురోగతిని సాధించింది. ప్లాంటేషన్, వర్షపు నీటి నిల్వ, ఇంకుడు గుంతలు, సోలార్ ఏర్పాటులో మాత్రం వెనుకబడినట్లు నివేదికలు వెల్లడించాయి. కాగా ప్రతి ఫైల్‌ను సగటున ఐదు గంటల వ్యవధిలోనే పరిష్కరించి క్లియర్ చేస్తుండడంతో జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేందుకు, సోషల్ మీడియా నిర్వహణ మరింత బలోపేతం చేసేందుకు గాను.. ఈ నెలాఖరు నాటికి మన్యం జిల్లా పౌర సంబంధాలశాఖ కార్యాలయానికి ఇద్దరు సోషల్ మీడియా సభ్యులను నియమించాలని సీఎం సూచించారు.
పథకాల అమలు.. అభివృద్ధి పనులు ఇలా..
- గిరిజన సంక్షేమంతో పాటు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో జిల్లా ముందంజలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 92, 220 ఎకరాల్లో జీడిమామిడి సాగువుతండగా 2026-27లో అదనంగా 2,471 ఎకరాలు, 2027-28లో మరో 2,471 ఎకరాల్లో విస్తరణకు ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లాలో 4,134 ఎకరాల్లో పైనాపిల్ సాగవుతోంది. 2026-27, 2027-2028లో ఏటా 247 ఎకరాల చొప్పున సాగును విస్తరించనున్నారు. 1352 ఎకరాల్లో పసుపు సాగవుతుండగా.. ఈ సంవత్సరం 1606 ఎకరాల్లో అదనంగా సాగు చేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో మూడు వేల ఎకరాల్లో పంట సాగు చేపట్టనున్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల్లో జిల్లా ముందంజలో ఉన్నట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
- స్ర్తీశక్తి పథకం ద్వారా 2025, ఆగస్టు 15 నుంచి 2026, ఆగస్టు 31 వరకు జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో 101 శాతంగా నమోదైంది. రోజుకు సగటున 0.68 లక్షల మంది ప్రయాణించారు. మొత్తంగా మహిళా ప్రయాణికుల సంఖ్య 2.60 కోట్లుగా నమోదైంది. బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ప్రాతిపదికన మన్యం జిల్లాకు 5వ స్థానం లభించింది. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో మొత్తం 1.9 లక్షల మంది దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. ఇందులో కూడా జిల్లా ముందంజలో ఉంది.
- గ్రామీణ బ్యాంకు లింకేజీ ద్వారా 20,136 మహిళా సంఘాలకు రూ.187.58 కోట్లు రుణాలు మంజూరు చేయగా.. జిల్లా 75.40 శాతం ప్రగతి సాధించింది. రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. పట్టణ లింకేజీలో 53.69 శాతం ప్రగతితో 16వ స్థానం సాధించింది. అయితే పర్యావరణ, భౌతిక పనుల్లో వెనుకబడి ఉండడంతో వేగం పెంచాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది.
- అనంత అరణ్య ప్లాంటేషన్‌లో జిల్లా బాగా వెనుకబడి ఉంది. జిల్లాలోని విద్యా సంస్థల ప్రాంగణంలో 65,913 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు కేవలం 11,821 మొక్కలను మాత్రమే నాటినట్టు నివేదిక వెల్లడించింది. 17.9శాతంతో జిల్లా నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇంకా పూర్తి చేయాల్సింది ఎంతో ఉంది.
- జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలు, సంక్షేమ వసతిగృహాల్లో 1.34 మెగావాట్ల సోలార్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఏడాదికి 1271 టన్నుల కార్బన్ వర్గాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో జిల్లాకు 9వ స్థానం లభించింది.
- వర్షపు నీటి నిల్వ గుంతల జిల్లా లక్ష్యం 142 కాగా ఒకటి కూడా పూర్తికాలేదు. 16 వరకు అంచనాలు మాత్రమే రూపొందించారని నివేదిక పేర్కొంది. సోక్ పిట్స్ (ఇంకుడు గుంతలు) లక్ష్యం 56 కాగా 41 ఎస్టిమేషన్లు పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తి కాలేదని నివేదిక స్పష్టం చేసింది.
- ఆటో డ్రైవర్ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4,963 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించారు. లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా చూస్తే మన్యం 25వ స్థానంలో నిలిచింది.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్...
జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణ, మహిళా స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు రుణాలు, గిరిజన సంక్షేమం, నెట్‌జీరో హెల్త్ క్యాంపెయిన్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. బ్యాంకుల లింకేజీల ద్వారా మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించి పాడి, చిన్న పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు యూనిఫామ్‌ల స్థానంలో స్పోర్ట్స్ తరహా యూనిఫారాలు అందించాలని ప్రతిపాదించారు. 12 అంశాలపై ప్రణాళికలను వివరించారు. కాగా ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతలోని క్రీడా ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. 2030, 2035 కామన్ వెల్త్, 2036 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని శిక్షణ అందించాలన్నారు. క్రీడాకారులను ఎంపిక చేసి రెండు వారాల్లో ప్రత్యేక శిక్షణ ప్రారంభించినున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి పాల్గొన్నారు.