Share News

Census జనగణనలో మన్యం ముందంజ

ABN , Publish Date - May 11 , 2026 | 11:55 PM

Manyam Leads in Census Operations జనగణన-2026 ప్రక్రియలో పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం పార్వతీపురంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు.

 Census     జనగణనలో మన్యం ముందంజ
ప్రత్యేక ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం, మే11(ఆంధ్రజ్యోతి): జనగణన-2026 ప్రక్రియలో పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం పార్వతీపురంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ ప్రక్రియ 15శాతం పూర్తవగా.. రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. హౌస్‌హోల్డ్‌ ఎన్యుమరేషన్‌లోనూ జిల్లా ప్రత్యేకత చాటుకుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు జనగణనపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు కలెక్టర్‌ తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్‌లో జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ కలాం చిత్రపటానికి కలెక్టర్‌, పూలమాలలు వేసి నివాళి అర్పించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అద్భుత విజయా లకు ప్రతీకగా, 1988, మే11న నిర్వహించిన అణుపరీక్షల విజయాన్ని స్మరించుకుంటూ ఏటా జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత, డీఈవో బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా..

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ ఆదేశిం చారు. సోమవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈనెల 13 నుంచి ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో హేబిటేషన్లు వారీగా లార్వావేట కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఉదయం 11 గంటల్లోపు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత చేపట్టాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే నీరు నిల్వ ఉన్న ప్రతి ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించాలని సూచించారు. ప్రతిచోటా విధిగా ఆయిల్‌ బాల్స్‌ వేయాలన్నారు. ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. జ్వరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:55 PM