గంజాయి నియంత్రణలో మన్యం నెంబర్ వన్
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:35 PM
గంజాయి నియంత్రణలో రాష్ట్రంలోనే మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): గంజాయి నియంత్రణలో రాష్ట్రంలోనే మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు అద్భుత పని తీరు కనబరిచిన పోలీస్‌శాఖతో పాటు సహకరించిన శాఖలను కలెక్టర్ అభినందించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ, రహదారి భద్రత, బాల్య వివాహాల నిర్మూలన కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల కృషి, అంకితభావం వల్లనే ఈ విజయం సాధ్యమైందన్నారు. విద్యా సంస్థలు, వసతిగృహాల విద్యార్థులపై ప్రత్యే నిఘా ఉంచాలన్నారు. విద్యా సంస్థలకు 500 మీటర్ల దూరంలో ఎటువంటి మత్తు పదార్థాలు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. జిల్లా బాల్య వివాహాలు జరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్ నివారణకు పోలీస్‌శాఖ తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌కు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో పూర్తిగా నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మనీషారెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కె.విజయకుమారి, జిల్లా రవాణా అధికారి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.