Share News

Manyam జాతీయ స్థాయిలో మెరిసిన మన్యం

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:07 AM

Manyam Earns National Recognition నీతి అయోగ్‌ అస్పిరేషనల్‌ డిస్ర్టిక్ట్‌ ప్రోగ్రాం డెల్టా ర్యాకింగ్స్‌లో మన్యం జిల్లా మెరిసింది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆరోగ్యం, పోషకాహారం విభాగంలో దేశంలో తొలిస్థానం, మౌలిక సదుపాయాల విభాగంలో రెండో స్థానం దక్కించుకున్నట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి గురువారం తెలిపారు.

Manyam   జాతీయ స్థాయిలో మెరిసిన మన్యం
ర్యాంకింగ్‌ల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

పార్వతీపురం, జూలై 9(ఆంధ్రజ్యోతి): నీతి అయోగ్‌ అస్పిరేషనల్‌ డిస్ర్టిక్ట్‌ ప్రోగ్రాం డెల్టా ర్యాకింగ్స్‌లో మన్యం జిల్లా మెరిసింది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆరోగ్యం, పోషకాహారం విభాగంలో దేశంలో తొలిస్థానం, మౌలిక సదుపాయాల విభాగంలో రెండో స్థానం దక్కించుకున్నట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి గురువారం తెలిపారు. విజయనగరం జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విజయానికి జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, ప్రజల సమష్టి కృషే కారణమన్నారు. జాతీయస్థాయిలో రెండు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తొలి ఏకైక జిల్లా పార్వతీపురం మన్యం అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 112 అస్పిరేషనల్‌ జిల్లాలతో పోటీపడిన పార్వతీపురం మన్యం విశిష్ట జాతీయ గుర్తింపు సాధించడం సామాన్య విషయం కాదన్నారు. గర్భిణుల సంరక్షణ, శిశు ఆరోగ్యం, టీకాలు కార్యక్రమాలు తదితర అంశాల్లో సాధించిన ప్రగతితో ఆ ర్యాంకులు దక్కించుకోలిగామని వెల్లడించారు. అనంతరం జరిగిన కార్య క్రమంలో కలెక్టర్‌ను జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసరావుతో పాటు అధికారులు తదితరులు సన్మానించారు.

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు: కలెక్టర్‌

పార్వతీపురం, జూలై9(ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం విజయనగరంలోని జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంట పొలాల గట్లుపై మొక్కలు నాటడం ద్వారా భూసారాన్ని కాపా డడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పారు. గట్లుపై వేప, మునగ, టేకు, నిమ్మగడ్డి, బంతి, చామంతి వంటి మొక్కలను పెంచాలని సూచించారు. అవి భూమిలో తేమను నిల్వ ఉంచడంతో పాటు పం టలకు రక్షణ కల్పిస్తాయన్నారు. పంట అవశేషాలను కాల్చరాదని వెల్లడించారు. వానపాములు, సూక్ష్మజీవులు భూసారాన్ని పెంచుతాయని తెలిపారు. బంతి, చామంతి సాగువల్ల చీడపీడలు, దోమలు తగ్గుతాయని, మలేరియా నివారణకు కూడా అవి దోహదపడతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్రికల్చర్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కార్య క్రమానికి మన్యం జిల్లా ఎంపిక కావడం గర్వకారణమన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 12:07 AM