mango price hike ఊరిస్తున్న మామిడి
ABN , Publish Date - May 20 , 2026 | 12:12 AM
mango price hike మధుర ఫలం మామిడి పండును చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. కిలో కొనాలని మార్కెట్‌కు వెళ్లేవారు రంగు, వాసన చూసి రెండు లేదా మూడు కిలోలు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. గతంలో వేసవిలో విరివిగా కనిపించే పండ్లు నేడు అక్కడక్కడే కంట పడుతున్నాయి. ధరలు కూడా అమ్మో అనిపిస్తున్నాయి.
ఊరిస్తున్న మామిడి
ఈ ఏడాది కలిసిరాని పంట
దిగుబడులు అంతంతమాత్రమే
ధర పెరుగుదలతో వినియోగదారులూ డీలా
మధుర ఫలం మామిడి పండును చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. కిలో కొనాలని మార్కెట్‌కు వెళ్లేవారు రంగు, వాసన చూసి రెండు లేదా మూడు కిలోలు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. గతంలో వేసవిలో విరివిగా కనిపించే పండ్లు నేడు అక్కడక్కడే కంట పడుతున్నాయి. ధరలు కూడా అమ్మో అనిపిస్తున్నాయి. దీంతో కొనాలన్నా ధర చూసి కోరికను అనుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు రైతులు కూడా సంతృప్తిగా లేరు. మొదట్లో విరగ్గాసిన మామిడి పూత తర్వాత రోజుల్లో మంచు, గాలుల తీవ్రతకు రాలిపోయింది. దిగుబడి అమాంతం తగ్గిపోయింది.
రామభద్రపురం, మే 19(ఆంధ్రజ్యోతి):
మామిడి పండ్లను కొనుగోలు చేయలేకపోతున్నామని వినియోగదారులు గగ్గోలు పెడుతుంటే.. దిగుబడి నిరాశపరిచిందని రైతులు అంటున్నారు. ఈ ఏడాది పంట రెండు వర్గాలనూ సంతృప్తి పరచలేకపోయింది. జిల్లాలో గతంలో ఎటు చూసినా మామిడి పండ్లతో కళగా కనిపించే మార్కెట్లు, తోటలు, జంక్షన్లు నేడు అంతంతమాత్రమైపోయాయి. మామిడి కాయలు, పండ్ల కోసం వ్యాపారులు క్యూ కట్టేవారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి అనేక మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చి పంటను అత్యధికంగా కొనుగోలు చేసి లారీల్లో తీసుకువెళ్లేవారు. ప్రధానంగా ఈ ఏడాది మంచు, పెనుగాలులు, అకాల వర్షాలు పంటను కబళించాయి. విరగ్గాసిన పూత అమాంతం రాలిపోవడంతో రైతుల ఆశలు గల్లంతయ్యాయి. పంట దిగుబడి సగానికిపైగా తగ్గిపోయింది.
జిల్లాలో 80 వేల ఎకరాల్లో మామిడిపంటను రైతులు సాగుచేస్తున్నారు. మెరకముడిదాం, గంట్యాడ, బొండపల్లి, దత్తిరాజేరు, తెర్లాం, బాడంగి, రామభద్రపురం, కొత్తవలస, వేపాడ, ఎస్.కోట మండలాల్లో మామిడి విస్తీర్ణం ఎక్కువ. బంగినపల్లి, పనుకులు, సువర్ణరేఖ, రసాలు, ఇతర రకాలు పండిస్తుంటారు. ఈ ఏడాది పూత ఆశాజనకంగా ఉండేది. కానీ పిందె కట్టే సమయంలో వాతావరణంలో వచ్చిన మార్పులతో పంట పోయింది. ఎకరాకు 4 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది 2 నుంచి రెండున్నర టన్నులకు పడిపోయింది.
- రామభద్రపురం పరిసర ప్రాంతాల నుంచి మామిడిపంటను రాయపూర్, ఒడిశా, కలకత్తా ప్రాంతాలకు ఏటా ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది ఆయా రాష్ట్రాల్లో కూడా మామిడి సాగు అనుకూలంగా ఉండడంతో ఇక్కడ పండించిన మామిడికి డిమాండ్ తగ్గిపోయింది. జిల్లాలోనే విక్రయించాల్సి వస్తోందని రైతులంటున్నారు. అయితే మామిడిలో ఫ్రూట్ కవర్స్ కట్టిన కాయలకు ఎక్కువ డిమాండ్ ఉంది. నాణ్యత, రంగు, రుచి బాగుండడంతో వినియోగదారులు ఈ మామిడిపండ్ల కొనుగోలుపైనే మక్కువ చూపుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మామిడి పండ్లకు కవర్లు పెడుతున్నారు. మామిడి రైతులంతా ఈ విధానం పాటించడం ద్వారా మార్కెట్‌లో మంచి ధరను పొందడానికి అవకాశం ఉంటుందని ఉద్యాన శాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. తుని, అనకాపల్లి, కృష్ణ, తిరుపతి జిల్లాల్లో మామిడి పంట రైతులు కవర్లు కట్టే విధానం అనుసరిస్తుండడం వల్ల రేటు ఎక్కువ పలుకుతోంది.
--------------------------------