Man Arrested మంత్రిపై అసభ్యకర పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్టు
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:47 PM
Man Arrested for Objectionable Social Media Post Against Minister గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాలూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ రామకృష్ణ ఆ కేసు వివరాలు వెల్లడించారు.
సాలూరు, జూలై8(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాలూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ రామకృష్ణ ఆ కేసు వివరాలు వెల్లడించారు. బొబ్బిలి మండలం పోలవాని వలసకు చెందిన ముంగి వేణు బీకామ్, డైట్ పాసై సూర్యఘర్ సోలార్‌లో పనిచేస్తున్నారు. కాగా గత నెల 16న మంత్రి అస్వస్థతకు గురైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే దీనిపై కొందరు ఆకతాయిలు మంత్రిపై అసభ్యకర కామెంట్లను పోస్టు చేశారు. వాటిని చదివిన టీడీపీ మక్కువ మండల అధ్యక్షుడు జి.వేణుగోపాలనాయుడు సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సాంకేతిక సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా వేణుసేహవాగ్219 మెయిల్ ఐడీతో పోలవానివలసకు చెందిన ముంగి వేణు మంత్రిపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. అసభ్యర పోస్టులు పెట్టిన మరికొందరిపై దర్యాప్తు చేస్తున్నామని , త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఎవరైనా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో రూరల్ ఎస్‌ఐ రవీంద్రరాజు ఉన్నారు.