మలేరియా రహిత జిల్లాయే లక్ష్యం
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:57 PM
Malaria-Free District Is the Goal మలేరియా రహిత జిల్లాయే లక్ష్యంగా వైద్యశాఖ ముమ్మర చర్యలు చేపడుతోందని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. మొండెంఖల్, నీలకంఠాపురం పీహెచ్‌సీల పరిధిలోని మలేరియా హైరిస్క్ గిరిజన గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.
కురుపాం,జూలై1(ఆంధ్రజ్యోతి): మలేరియా రహిత జిల్లాయే లక్ష్యంగా వైద్యశాఖ ముమ్మర చర్యలు చేపడుతోందని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. మొండెంఖల్, నీలకంఠాపురం పీహెచ్‌సీల పరిధిలోని మలేరియా హైరిస్క్ గిరిజన గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా రాముడుగూడలో ఆయన స్వయంగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. విధిగా దోమతెరలు వాడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గిరిజనులకు ఆయన సూచించారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. మలేరియా హైరిస్క్ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. మైదాన ప్రాంతాల నుంచి హెల్త్ అసిస్టెంట్లను డిప్యూటేషన్‌పై హైరిస్క్ గిరిజన గ్రామాలకు పంపితున్నామని వ్లెలడించారు. అనంతరం డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా కోసంగూడ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగాం ఆఫీసర్ టి.జగన్మోహనరావు, మొండెంఖల్, నీలకంఠాపురం పీహెచ్‌సీ వైద్యాధికారులు, ఆశావర్కర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
3,800 మందికి వైద్య పరీక్షలు
పార్వతీ పురం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 779 హైరిస్క్ గ్రామాల్లో బుధవారం నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌వో భాస్కరరావు చెప్పారు. మొదటి రోజున 58 గ్రామాల్లో 3,800 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. ఇందులో 41 మందికి జ్వరాలు ఉన్నాయని గుర్తించామన్నారు. వారం రోజుల్లో ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు.