Malaria Tightens Its Grip on Tribal Areas మన్యంపై మలేరియా పంజా
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:15 AM
Malaria Tightens Its Grip on Tribal Areas సీతంపేట మన్యంలో మలేరియా పంజా విసురుతోంది. ఇప్పటికే అనేక గ్రామాల్లో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా గిరిజనులు జ్వరాలతో మంచం పట్టారు. మరికొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
సీతంపేటలో కలవరం
సీతంపేట రూరల్, జూన్23(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో మలేరియా పంజా విసురుతోంది. ఇప్పటికే అనేక గ్రామాల్లో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా గిరిజనులు జ్వరాలతో మంచం పట్టారు. మరికొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కాగా మలేరియాతో చికిత్స పొందుతూ ఇద్దరు గిరిజన విద్యార్థులు మృతి చెందడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
- జొనగ జగ్గడుగూడ గ్రామానికి చెందిన సవర దివాకర్(9) సీతంపేట ఐటీడీఏ పరిధిలోని మల్లి ఏపీఆర్ గురుకుల బాలుర పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈనెల 12న పాఠశాల పునఃప్రారంభమైనప్పటికీ వెళ్లలేదు. గ్రామంలో ఇంటివద్దే ఉంటున్న దివాకర్‌కు ఈనెల 16న జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు లాజర్, మేరిలు తమ కుమారుడిని పాలకొండలోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. వైద్యపరీక్షల అనంతరం మలేరియా అని తేలడంతో మందులు తీసుకుని తిరిగి వారు స్వగ్రామం చేరుకున్నారు. ఇంటి వద్దే ఉండి మందులు వాడుతున్నా.. దివాకర్‌కు జ్వరం తగ్గుముఖం పట్టలేదు. 18న మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఆ విద్యార్థిని చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అదేరోజున శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి రిఫెర్ చేశారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం దివాకర్ మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు సంతానం కాగా.. ఇంటికి చిన్నవాడైన దివాకర్ జ్ఞాపకాలను తలుచుకుంటూ భోరున విలపిస్తున్నారు.
నౌగూడ గ్రామానికి చెందిన సవర పూర్ణచంద్ర(17)అనే గిరిజన విద్యార్థి కూడా మలేరియా, పచ్చకామెర్లతో బాధపడుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... నౌగూడకు చెందిన సవర రాజేష్, గంగమ్మి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారుడు పూర్ణచంద్ర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా పూర్ణచంద్ర సీతంపేట ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి కొంతకాలంగా ఇంటివద్దే ఉంటూ.. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈనెల 17న పూర్ణచంద్రకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ పూర్ణచంద్ర సోమవారం రాత్రి మృతిచెందినట్లు తండ్రి రాజేష్ చెప్పాడు. తన కుమారుడికి మలేరియా, టైఫాయిడ్‌తో పాటు పచ్చకామెర్ల వ్యాధి ముదిరి బ్రెయిన్‌కు చేరడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారని వాపోయాడు. కాగా ఒక్కగానొక్క కొడుకు అకాల మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.