Malaria మన్యంలో మలేరియాపై ఆరా
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:37 PM
Malaria Cases Under Scrutiny in the Agency Area జిల్లాలో మలేరియా, డెంగ్యూ, సీజనల్ వ్యాధుల పరిస్థితిపై రాష్ట్రస్థాయి మలేరియా బృందం ఆరా తీసింది. ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. రాష్ట్ర సంచాలకులు వీర్రాజు, కన్సల్టెంట్ రామచంద్ర, జోనల్ కార్యాలయ సహాయ సంచాలకులు మనోరమ తదితరులు ముందుగా జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో విజయలక్ష్మితో సమావేశ మయ్యారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితుల పరిశీలన
గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా, డెంగ్యూ, సీజనల్ వ్యాధుల పరిస్థితిపై రాష్ట్రస్థాయి మలేరియా బృందం ఆరా తీసింది. ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. రాష్ట్ర సంచాలకులు వీర్రాజు, కన్సల్టెంట్ రామచంద్ర, జోనల్ కార్యాలయ సహాయ సంచాలకులు మనోరమ తదితరులు ముందుగా జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో విజయలక్ష్మితో సమావేశ మయ్యారు. వ్యాధుల తీవ్రత, నివారణ చర్యలపై చర్చించారు. అనంతరం రాష్ట్రస్థాయి బృంద సభ్యులు దొరజమ్ము వసతిగృహాన్ని సందర్శించారు. ఇటీవల 8వ తరగతి విద్యార్థి రామ్‌చరణ్ మలేరియా బారిన పడడంతో అక్కడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలు సుకున్నారు. వసతిగృహంలో దోమతెరల వినియోగంపై ఆరా తీశారు. సిక్ రూమ్‌ను పరిశీలించి అనారోగ్యంతో ఉన్న విద్యార్థులకు సరిపడా మందులు అందుతున్నాయా లేదానని అడిగి తెలుసు కున్నారు. జ్వర పీడితుల నమోదు రిజిస్టర్లను నిశితంగా పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా దుడ్డుఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. వైద్యాధికారి లీలతో కలిసి ల్యాబ్ రికార్డులను తనిఖీ చేశారు. వైద్య పరీక్షల్లో గుర్తించిన కొన్ని లోపాలను వెంటనే సరిదిద్దు కోవాలని సూచించారు. మలేరియా నిర్ధారణ అయిన ప్రతీకేసును పారదర్శకంగా రికార్డుల్లో చూపించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ, సబ్ యూనిట్ అధికారులు రమణ, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.