Malaria ఏజెన్సీలో మలేరియా
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:23 AM
Malaria Cases in the Agency Area జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో గిరిజన గ్రామాల్లో ప్రజలు వణుకుతున్నారు. ఇప్పటికే పార్వతీపురం, పాలకొండ, సీతంపేట ఏరియా ఆసుపత్రుల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
చిన్నా, పెద్దా అంతా జ్వర పీడితులే..
రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిట..
హైరిస్క్ గ్రామాల్లో అక్కడక్కడా దోమ తెరల పంపిణీ
సీతంపేట రూరల్/జియ్యమ్మవలస, జూన్20(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో గిరిజన గ్రామాల్లో ప్రజలు వణుకుతున్నారు. ఇప్పటికే పార్వతీపురం, పాలకొండ, సీతంపేట ఏరియా ఆసుపత్రుల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. హైరిస్క్ గ్రామాల్లో మలేరియా నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ పాజిటివ్ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ‘మాఊరికి మలేరియా వచ్చింది’ కార్యక్రమం ద్వారా దోమల నివారణ, రక్షణ వంటి అంశాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరపీడితులు రోజురోజుకూ పెరుగుతున్నారు.
ఇదీ పరిస్థితి..
-జిల్లాలోని 15 మండలాల్లో 4 లక్షల దోమతెరలు అవసరమని జిల్లా మలేరియా అధికారులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపారు. అయితే ఈఏడాది మార్చిలో 26,339 మాత్రమే వచ్చాయి. వాటిని అధికారులు 717 మలేరియా హైరిస్క్ గ్రామాల్లో ఏప్రిల్ నెలలో పంపిణీ చేశారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న దోనుబాయి, కుసిమి, మర్రిపాడు పీహెచ్‌సీల పరిధిలో 195వరకు మలేరియా హైరిస్క్ గ్రామాలు గుర్తించారు. దోనుబాయి పీహెచ్‌సీ పరిధిలో గత ఏడాది ఎక్కువగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో 14గిరిజన గ్రామాల్లో 3,300 దోమతెరలను ఈ ఏడాదిలో పంపిణీ చేశారు. మిగిలిన పీహెచ్‌సీల పరిధిలో ఉన్న హైరిస్క్ గ్రామాల్లో దోమతెరలను ఇంకా పంపిణీ చేయలేదు. దీంతో దోమ కాటుకు గురై గిరిపుత్రులు జ్వరాల బారినపడుతున్నారు.
- 2020-21లో ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మలేరియా హైరిస్క్ ప్రాంతాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో తైవాన్ దోమతెరల(మస్కిటో నెట్స్)ను పంపిణీ చేసింది. వాస్తవంగా ప్రతి నాలుగేళ్లకొకసారి మలేరియా హైరిస్క్ గ్రామాల్లో దోమతెరలను పంపిణి చేయాల్సి ఉంది. కానీ నేటికి సుమారు ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పంపణీ జరగలేదు. మరోపక్క ఎపిడమిక్ సీజన్ ముంచుకోస్తోంది. సీతంపేట ఏజెన్సీలో ఏగ్రామంలో చూసిన పదుల సంఖ్యలో మలేరియా, వైరల్ జ్వరపీడితులు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
చినమేరింగి సీహెచ్‌సీకి రోగుల తాకిడి..
జియ్యమ్మవలస మండలం అర్నాడ పంచాయతీ పరిధిలో వనజ, తుమ్మిగూడ, కొత్తగూడ, అర్నాడ, అర్నాడవలస, కొత్తవలస, బిల్లమానుగూడ గ్రామాల్లో మలేరియా విజృంభిస్తోంది. నిత్యం ఎంతోమంది చినమేరంగి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. ఆయా గ్రామాల్లో నీటి కాలుష్యమా? పరిసరాల ప్రభావమా? మరే ఇతర కారణమో తెలియదు గాని జ్వరాల తీవ్రత మాత్రం తగ్గడం లేదని వైద్యులే చెబుతున్నారు. ఇదే పంచాయతీలోని పలు గ్రామాల్లో ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం పర్యటించి చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి మారడం లేదు. ప్రస్తుతం కొత్తవలస నుంచి ఊలక కోమలి, ఊలక రేణుక, మండంగి వినోద్‌తో పాటు వనజ గ్రామం నుంచి పి.అసిత, కొండగొర్రి ధరణిలు, కొత్తగూడ నుంచి కె.గౌరమ్మలు మలేరియాతో చినమేరంగి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. వీరే కాకుండా టీకే జమ్ము పంచాయతీ చినదోడిజ, పెదదోడిజ గ్రామ గిరిజనుల్లో కొందరు మలేరియాతో ఇక్కడే చికిత్స పొందుతున్నారు. సీహెచ్‌సీలో అవసరమైన గదులు లేక వరండాలోనే మంచాలు వేశారు. అయినప్పటికీ రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఒక మంచంపై ఒకరిద్దరు రోగులకు చిత్స అందిస్తున్నారు.
డీఎంవో ఏమన్నారంటే...
‘జిల్లాలోని హైరిస్క్ గ్రామాల్లో దోమతెరల పంపిణీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇటీవల మొదటివిడతలో వచ్చిన దోమతెరలను కొన్ని హైరిస్క్ గ్రామాల్లో పంపిణీ చేశాం. అంతేకాకుండా గ్రామాల్లో మలేరియా మందు పిచికారీ చేయించాం. యాంటీ లార్వ ఆపరేషన్ వంటి కార్యక్రమాలను చేయిస్తున్నాం.’ అని జిల్లా మలేరియా అధికారి డి. సూర్యనారాయణ తెలిపారు.