కొత్తవలసలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:27 AM
కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పూరిగుడిసెతో సహా సుమారు 18 మోటార్‌సైకిళ్లు, 3 సైకిళ్లు కాలిపోయాయి.
పూరిపాకతో సహా 18 మోటార్‌సైకిళ్లు, 3 సైకిళ్లు దగ్ధం
కొత్తవలస, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పూరిగుడిసెతో సహా సుమారు 18 మోటార్‌సైకిళ్లు, 3 సైకిళ్లు కాలిపోయాయి. సుమారు రూ.4లక్షల 80వేలు నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. సుమారు రూ.15లక్షల ఆస్తి నష్టం జరిగిఉంటుందని భావిస్తున్నారు. అగ్నిమాపం అధికారి వై.అశోక్ కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస ఆర్టీసీ కాంప్టెక్సు సమీపంలో కొత్తవలస-ఎస్.కోట రోడ్డు పక్కన వరిగల జనార్దన్, నరసరాజు, సాయి అనే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పూరిపాక వేసుకుని, అందులో నివాసం ఉంటున్నారు. ఈ పూరిపాక వెనుక దేవస్థానానికి చెందిన ఖాళీ స్థలం ఉండగా ఆ ఖాళీ స్థలంలో వివిధ గ్రామాల నుంచి ఉద్యోగాలు చేయడానికి వచ్చిన వారు తమ ద్విచక్రవాహనాలను పార్కింగ్ చేస్తూఉంటారు. పూరిపాక యజమానికి నెలవారీగా కొంతసొమ్ము ఇస్తుంటారు. ఎప్పటిలాగే చాలామంది ఈ పాక చుట్టూ మోటార్‌సైకిళ్లను పార్కింగ్ చేసుకుని, శుక్రవారం తమ డ్యూటీలకు వెళ్లి పోయారు. అయితే ఈ పూరిపాక మీద నుంచి వెళుతున్న విద్యుత్ వైర్లు షార్టుషర్క్యూట్ కావడంతో నిప్పు రవ్వలు పాకపై పడ్డాయి. దీంతో పూరిపాకకు నిప్పంటుకుంది. దీంతో పాక చుట్టూ ఉన్న మోటార్‌సైకిళ్లకు కూడా నిప్పంటుకుని, కాలిపోయాయి. వీటితో పాటు ఈ పూరిపాకలో ఉన్న వంట పాత్రలు, దుస్తులు, బియ్యం, నిత్యావసర సరుకులు, బంగారం, గృహోపకరణాలు, నగదుతో పాటు సర్టిఫికెట్స్ కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి, మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని సీఐ టీవీ విజయ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కొత్తవలస మాజీ సర్పంచ్ గొరపల్లి రాము బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందించడానికి ముందుకు వచ్చారు.