ప్లాస్టిక్ దుకాణాంలో భారీ అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:53 PM
పట్టణంలోని పాలకొండ-రాజాం రోడ్డులో ఉన్న కోటదుర్గ పాత ప్లాస్టిక్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
- మిషనరీ.. రెండు వాహనాలు దగ్ధం
- రూ.50 లక్షల ఆస్తి నష్టం
పాలకొండ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాలకొండ-రాజాం రోడ్డులో ఉన్న కోటదుర్గ పాత ప్లాస్టిక్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్లాస్టిక్ క్రష్ మిషనరీ, రెండు ట్రాన్స్‌పోర్టు వాహనాలు, 70 టన్నుల ప్లాస్టిక్ మెటీరియల్ పూర్తిగా దగ్ధకావడంతో షాపు యజమాని బెవర మణికంఠ లబోదిబోమంటున్నాడు. పాలకొండ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా సాధ్యంకాలేదు. దీంతో రాజాం, పార్వతీపురం, కొత్తూరు ఫైర్‌స్టేషన్ల నుంచి మూడు అగ్నిమాపక వాహనాలను తెప్పించి మంటలను ఆర్పివేశారు. ప్లాస్టిక్ కావడంతో మంటలు అదుపులోకి రావడం కష్టమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి సింహాచలం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. సుమారు రూ.50 లక్షలు ఆస్తినష్టం ఉంటుందని అంచనా వేశారు. ఎస్‌ఐ డోల వెంకన్న, పాలకొండ అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.