Share News

Major changes in YCP! వైసీపీలో భారీ కుదుపు!

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:02 AM

Major changes in YCP! గజపతినగరం వైసీపీలో క్రియశీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేత చిన్న శ్రీను బాటలోనే పయనిస్తారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. చిన్నశ్రీను అంటే ఆయనకు ఎనలేని అభిమానం. దీంతో త్వరలో సైకిల్‌పై సవారీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Major changes in YCP! వైసీపీలో భారీ కుదుపు!

వైసీపీలో భారీ కుదుపు!

చిన్న శ్రీను రాజీనామాతో పార్టీ కకావికలం

ఆయన వెంటే బావ బడ్డుకొండ అప్పలనాయుడు?

అన్ని నియోజకవర్గాల నుంచి ద్వితీయ శ్రేణి నేతల చూపు

చీపురుపల్లిపై తక్షణ ప్రభావం

- గజపతినగరం వైసీపీలో క్రియశీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేత చిన్న శ్రీను బాటలోనే పయనిస్తారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. చిన్నశ్రీను అంటే ఆయనకు ఎనలేని అభిమానం. దీంతో త్వరలో సైకిల్‌పై సవారీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

- బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండలంలో ఓ ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకుడు బుధవారం విజయనగరంలోని చిన్నశ్రీను ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ తోనే మా ప్రయాణం, మీ వెంటే మేము’ అంటూ చిన్నశ్రీనుతో చెప్పారు.

- నెల్లిమర్ల నియోజకవర్గం జర్జాపుపేట నుంచి కొంతమంది చిన్నశ్రీను అభిమానులు ఆయన్ను బుధవారం కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో మీ మార్క్‌ రాజకీయంతో జిల్లాలో క్లీన్‌ స్లీప్‌ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, యువనేత లోకేశ్‌కు బహుమతిగా అందించాలని కోరారు.

విజయనగరం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. సీనియర్‌ నాయకుడు, జడ్పీ చైర్మన్‌ చిన్నశ్రీను వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన మరుక్షణం కొత్త పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల నుంచి ఆయన అభిమానులు, ద్వితీయ శ్రేణి నేతలు శ్రీను బాట పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన బావ బడ్డుకొండ అప్పలనాయుడు కూడా ఇదే నిర్ణయంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా.. జిల్లాలో ఆ పార్టీ ప్రభావం ఉంటుందన్న అంచనాలు వెలువడ్డాయి కానీ బలమైన నేత మజ్జి శ్రీనివాసరావు పార్టీ మారిపోవడంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాష్ట్రంలోనే బలమైన రాజకీయ కుటుంబంగా ఉన్న బొత్స ఫ్యామిలీ చీలిపోయినట్టు అయ్యింది. ఆ కుటుంబాన్ని వెనుక ఉండి స్తంభలా మోస్తూ వస్తున్న వ్యక్తి చిన్న శ్రీను. అతడే పార్టీని వీడడంతో ఇక వైసీపీ జిల్లాలో బలహీనమైనట్టేనన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే చిన్నశ్రీను, ఆయన కుమార్తె సిరి సహస్ర మాత్రమే కాదు. భారీగా బంధుగణం, ద్వితీయ శ్రేణి నాయకత్వం, కేడర్‌ మొత్తం టర్న్‌ అయిపోయినట్టు కనిపిస్తోంది. చిన్న శ్రీను కండువా మార్చిన మరుక్షణం విజయనగరం జిల్లా రాజకీయాల్లోనే సమూల మార్పులు సంతరించుకున్నాయి.

నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే సైతం.. ?

చిన్న శ్రీను వెంటే ఆయన బావ, వియ్యంకుడు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నడవనున్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వాస్త్తవానికి గత ఎన్నికలకు ముందు బడ్డుకొండ అప్పలనాయుడు ఓడిపోవటానికి కారణం ఓ ముఖ్యనేత తమ్ముడనే ప్రచారం గట్టిగా సాగింది. ఒకటి రెండుసార్లు పంచాయితీ కూడా నడిచింది. ఎన్నికల తరువాత కూడా బడ్డుకొండ అప్పలనాయుడు అనుకున్న స్థాయిలో క్రియాశీలకంగా లేరు. పైగా పూసపాటి అశోక్‌గజపతి రాజుకు గవర్నర్‌ ఎంపిక సమయంలో బహాటంగానే ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకు వన్నె తెచ్చారంటూ కొనియాడారు. వైసీపీ నాయకత్వానికి కోపం వస్తుందని తెలిసి కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బావ చిన్న శ్రీను పార్టీ మారడంతో ఆయన సైతం అనుసరిస్తారన్న ప్రచారం జిల్లా వర్గాల్లో ఉంది.

సొంత బలగం

జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో చిన్న శ్రీనుకు సొంత బలగం ఉంది. వాస్తవానికి బొత్స రాష్ట్రస్థాయి నాయకుడిగా మారిన తరువాత జిల్లా వ్యవహారాలను చిన్నశ్రీనే అన్నీతానై చూసుకున్నారు. 2018లో జగన్‌ పాదయాత్ర సమయంలో, అటు తరువాత 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా చిన్న శ్రీను కనుసన్నల్లో వ్యవహారాలు నడిచేవి. జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయంటే ఆయన ఏ స్థాయిలో పావులు కదపగలరో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మండలస్థాయి జడ్పీటీసీలు, ఎంపీపీలే ద్వితీయ శ్రేణి నాయకత్వంగా వ్యవహరిస్తుంటారు. వారంతా చిన్న శ్రీను అనుచరులుగానే ముద్రపడ్డారు. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరడంతో వారు అటువైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. తక్షణ ప్రభావం చూపే నియోజకవర్గం మాత్రం చీపురుపల్లి. ఆ నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో వైసీపీ కేడర్‌ చెల్లాచెదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. కనీసం పోటీచేసేందుకు వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి రావొచ్చునంటున్నారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలోనూ ప్రభావం ఉండనుంది. బడ్డుకొండ సైతం పార్టీ మారితే అక్కడ టీడీపీ బలమైన శక్తిగా ఎదగనుంది. మరోవైపు రాజాం నియోజకవర్గంలో తూర్పుకాపు సామాజికవర్గం అధికం. అక్కడ కూడా శరవేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. అక్కడ చిన్నశ్రీనుకు అనుచరవర్గం ఎక్కువ. మరోవైపు గజపతినగరం నియోజకవర్గంలో ఇప్పటికే మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పట్టుబిగిస్తున్నారు. ఎస్‌.కోట, బొబ్బిలి నియోజకవర్గాల్లో వైసీపీ కేడర్‌తో చిన్నశ్రీనుకు సంబంధాలు ఎక్కువ. అక్కడ సైతం భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

----------------

Updated Date - Sep 10 , 2026 | 12:02 AM