తప్పిన ఘోర ప్రమాదం
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:09 AM
మండలంలోని మహా రాజపేట సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర ప్రమాదం తప్పింది.
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఎనిమిది మందికి గాయాలు
భోగాపురం, సెప్టెంబ రు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని మహా రాజపేట సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర ప్రమాదం తప్పింది. లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎని మిది మందికి గాయాల య్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి పలాసకు సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మహరాజపేట సమీపానికి వచ్చేసరికి వర్షపు జల్లులు పడుతుండడంతో ప్రమాదవశాత్తు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకుంది. దీంతో బస్సులో ఉన్న వారందరూ భయాందోళనకు గురై.. ఒక్కసారిగా కిందకి దిగిపోయారు. అయితే బస్సులో ముందు సీట్లలో ఉన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పాకివలస గ్రామానికి చెందిన కొనారి రాము, శ్రీకాకుళంకు చెందిన కొయ్య నవ్య, విశాఖ జిల్లా ఆరిలోవకు చెందిన తుమ్మి వరలక్ష్మి, తుమ్మి పద్మ, ఉండాల యోగేశ్వరావు, సత్తపల్లి కుమారి, మన్నె తనూషతో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరికి మిగతా ప్రయాణికులు సపర్యలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సీఐ కె.దుర్గాప్రసాదరావు సూచనల మేరకు క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.