Share News

maining in wrong rute ‘నిక్షేప’ంగా దోపిడీ!

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:57 PM

maining in wrong rute జిల్లాలో అక్రమ మైనింగ్‌ తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఖనిజ నిక్షేపాలను గుట్టుగా కొల్లగొడుతున్నారు. రెండోకంటికి తెలియకుండా తవ్వకాల ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గరివిడి, మెరకముడిదాం, రాజాం మండలాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి.

 maining in wrong rute ‘నిక్షేప’ంగా దోపిడీ!
భూమిని చీల్చినట్టుగా లోతుగా తవ్వకాలు చేపట్టిన దృశ్యం

‘నిక్షేప’ంగా దోపిడీ!

భూమిని చీల్చి మాంగనీసు తవ్వకాలు

గెడ్డపువలసలో అక్రమార్కుల దందా

ఇప్పటికే వేలాది టన్నుల తరలింపు

ప్రభుత్వ ఆదాయానికీ గండి

- గత ఏడాది ఫిబ్రవరిలో మెరకముడిదాం మండలం కొత్తకర్రలో 200 టన్నుల మాంగనీసు నిల్వలు పట్టుబడ్డాయి. అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని గనుల శాఖ విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందడంతో వారు తనిఖీ చేశారు. దీంతో నిల్వ ఉంచిన వందల కిలోల మాంగనీసును స్వాధీనం చేసుకున్నారు.

- గత ఏడాది అక్టోబరు 11న రాజాం మండలం గార్రాజుచీపురుపల్లిలో 130 టన్నుల మాంగనీసు నిల్వలను అధికారులు పట్టుకున్నారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. టన్నుల కొద్ది మాంగనీసు నిల్వలు పట్టుబడ్డాయి.

- గరివిడి మండలం దేవాడలో మాంగనీసు తవ్వకాలు అనుమతికి మించి జరుగుతున్నాయంటూ సీఎంవో కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్పందించారు. జిల్లా అధికారులకు సమగ్ర నివేదికను అడిగారు. వైసీపీ హయాంలో వేలం వేయగా..అనుమతికి మించి తవ్వకాలు జరిపారన్నది ప్రధాన ఆరోపణ.

విజయనగరం/గరివిడి జూన్‌ 27(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో అక్రమ మైనింగ్‌ తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఖనిజ నిక్షేపాలను గుట్టుగా కొల్లగొడుతున్నారు. రెండోకంటికి తెలియకుండా తవ్వకాల ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గరివిడి, మెరకముడిదాం, రాజాం మండలాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ‘లీజు’ వ్యవహారాలు నడిచాయి. కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయి. తాజాగా గరివిడి మండలం గెడ్డపువలసలో అక్రమంగా తవ్వకాలు జరిపి వేలాది టన్నుల మాంగనీసు నిక్షేపాలను తరలించుకుపోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా భూగర్భాన్ని చీల్చేస్తున్నారు. పైగా అవి డీపట్టా భూములు. ఆపై ఎటువంటి అధికారిక అనుమతులు లేవు. కానీ రాత్రి పగలూ అన్న తేడా లేకుండా యంత్రాలతో తవ్వకాలు చేపట్టి టన్నుల కొద్దీ నిక్షేపాలను దాటించేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. గరివిడి మండలం గెడ్డపువలసలో సాగుతున్న ఈ అక్రమ తంతు జిల్లా అధికారులకు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

జరిగింది ఇది..

గెడ్డపువలసలో 3 ఎకరాలకుపైగా డీపట్టా భూమి ఉంది. అందులో మాంగనీసు తవ్వకాలు జరుపుతున్నారు. అధికార పార్టీ చోటా నాయకుడు కనుసన్నల్లోనే ఈ తంతంగం జరుపుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ నేత ఆధీనంలో ఈ భూములు ఉండగా.. పొక్లెయినర్లు పెట్టి వందల అడుగుల లోతులో తవ్వకాలు జరిపారు. వెలికితీసిన మాంగనీసు ఖనిజాన్ని వాహనాల్లో బయటకు తరలించేందుకు గనిలో సొరంగం తవ్వి 300 మీటర్లుకుపైగా మార్గాన్ని ఏర్పాటుచేశారు. ఖనిజాన్ని మట్టితో సహా బయటకు తరలించి ఒకచోట డంపింగ్‌ చేస్తున్నారు. కూలీలను పెట్టి ఖనిజాన్ని వేరుచేసి రాత్రి వేళ్లలో తరలించుకుపోతున్నారు. దీనిని ఫెర్రో అల్లాయూస్‌ పరిశ్రమలకు, మాంగనీసు వ్యాపారులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

నిబంధనలు ఇవి..

మాంగనీసు తవ్వకాల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. సొంత పట్టా స్థలంలోనైనా భూగర్భంలో మాంగనీసుపై ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయి. ప్రైవేటు లేదా పట్టా భూముల్లో ఖనిజం ఉన్నట్టు తేలితే వాటిని తవ్వేందుకు మైనింగ్‌ శాఖ నుంచి లీజు పొందాలి. పర్యావరణ అనుమతులు సైతం తప్పనిసరి. తవ్విన ఖనిజానికి నిర్ణీత రాయాల్టీ కూడా చెల్లించాలి. ఈ నిబంధనలు పాటించకుండా తవ్వకాలు జరిపితే అక్రమ మైనింగ్‌ కిందకు వస్తుంది. బాధ్యులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు, భారీగా జరిమానా, జైలుశిక్ష తప్పదని చట్టం చెబుతోంది.

చర్యలు తీసుకుంటాం

అక్రమ మైనింగ్‌ అనేది నేరం. మాంగనీసు తవ్వకాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. చెరువులు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో మాంగనీసు, మట్టి, గ్రావెల్‌ తరలించినా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సిబ్బందిని అప్రమత్తం చేశాం. అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తాం. తవ్వకాలు చేపడుతున్న వద్ద సూచిక బోర్డులు పెడతాం.

- సూర్యచంద్ర, ఏడీ, భూగర్భ గనుల శాఖ, విజయనగరం

Updated Date - Jun 27 , 2026 | 11:57 PM